క్రైసిస్ మేనేజ్‌మెంట్ కింగ్ .. ‘‘ సీబీఎన్ ’’.. సీఎంగా బాధితులకు భరోసా, పొలిటీషియన్‌గా వైసీపీకి మాస్టర్ స్ట్రోక్

  • September 21, 2024 / 07:43 PM IST

అంతకుముందెన్నడూ చూడని ప్రళయం.. కళ్లెదుటే కరాళనృత్యం చేసింది. చూస్తుండగానే ఆ విధ్వంసకర విపత్తు.. చుట్టుముట్టేసింది. గంటల వ్యవధిలో కురిసిని కుండపోత వర్షానికి వాగులు, వంకలు ఏకమై, బుడమేరు ఉప్పొంగి బెజవాడను ముంచేసింది. అడుగులతో మొదలై.. భారీ భవనాలనే మించేంతగా వరద పోటెత్తింది. ఆ రక్కసి ధాటికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు.. నేనున్నానంటూ ఆ నాయకుడు అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయకుండా , 74 ఏళ్ల వయసులో జేసీబీలపై, పడవలపై ఇంటింటికి తిరిగి బాధితులకు భుజం కాశారు. వారిలో మనోస్థైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. విపక్షాల దుష్ప్రచారానికి తన చేతలతోనే సమాధానం చెప్పారు . ఆయనే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విపత్తులు ఎదుర్కోవడంలో , అధికార యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడంలో తనకు సాటి రారని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బురదలో కూరుకుపోయిన విజయవాడని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆయన సేవలు అమోఘం. విపత్తులు చోటు చేసుకున్నప్పుడు ఆశగా కేంద్రం వంక చూసే ముఖ్యమంత్రిని కాదని ఆయన ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక సాయాన్ని, వ్యూహాలను వినియోగించి జన సామాన్యాన్ని ఎన్నోసార్లు ఒడ్డున పడేశారు. 1996 కోనసీమ తుఫాన్, హుదుద్ వంటి సూపర్ సైక్లోన్‌లను చంద్రబాబు తన స్ట్రాటజీతో ఎదుర్కొన్నారు. ప్రకృతి ముందు నిలబడటం అసాధ్యమని ఆయనకు తెలియని కాదు.. కానీ విలయం నుంచి వికాసం వైపు నడిపించడంలో చంద్రబాబు తనదైన విజన్ చూపారు. విజయవాడ వరదల్లో చంద్రబాబు పనితీరు .. దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.

ఆగస్ట్ చివరి వారంలో పుట్టిన ముసురు దెబ్బకు విజయవాడ వణికిపోయింది. గడిచిన 20 ఏళ్లలలో ఎన్నడూ లేనంతగా నగరం వరదను చవిచూసింది. ఎడతెరిపి లేకుండా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి వచ్చింది. అన్ని చోట్లా దాదాపు మనిషి ఎత్తులో నీరు చొచ్చుకొచ్చింది. బస్టాండ్ సమీపంలోని రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన వద్ద దాదాపు ఏడు అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో జనం విలవిలలాడిపోయారు. నగరంలోని ప్రతీ కాలనీ నీట మునిగినా.. న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, జక్కంపూడి, సింగ్ నగర్ ఏరియాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. వర్షాలు, వరద పరిస్ధితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న చంద్రబాబు.. వర్షం తెరిపినిచ్చిన తర్వాత నేరుగా రంగంలోకి దిగారు. తాను స్పాట్‌లో ఉంటేనే అధికార యంత్రాంగం అలర్ట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో సీఎం బయల్దేరారు.

కాన్వాయ్‌ని పక్కనబెట్టి ఓ జేసీబీలోనే నగరం మొత్తం తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ .. అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. మంత్రులు, అధికారులు, పార్టీ కేడర్‌ను ఆదేశించి పనిచేయించే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం తానే స్వయంగా బాధితులకు అండగా నిలుస్తానని చెప్పారు. విజయవాడలో పరిస్ధితులు చూస్తే బాధగా ఉందని.. లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారని.. ఇవన్నీ చూస్తే నా మనసు కుదురుగా ఉండటం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పర్యవేక్షణలోనే అధికారులు , సహాయక సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం చేశాయి.

అర్దరాత్రి వేళలోనూ బోటుపై పర్యటించి అందరికీ ఆహారం, మంచినీరు అందిందా లేదా అన్న వివరాలు ఆరా తీశారు. తానే స్వయంగా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ , బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే , తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుని విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిస్ధితులను ఆరా తీసేవారు. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక చేరవేస్తూ టచ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఆయన కృషి ఫలితంగానే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి ఆగమేఘాల మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు చౌహాన్. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని.. తాము కూడా ఆయన విజ్ఞప్తి మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

విజయవాడను వరద ముంపు నుంచి ఒడ్డున పడేసిన చంద్రబాబుకు బురద తొలగింపు వ్యవహారం సవాళ్లు విసిరింది. రాష్ట్రంలోని అగ్నిమాపక శకటాల్లో సింహభాగం విజయవాడకు తెప్పించిన ఆయన వీధుల వెంబడి బురద తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్యం, విద్యుత్ కార్మికులను రప్పించి పనులను వేగంగా జరిపించారు. వరద నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. వరద ముంపు నుంచి బెజవాడ బయటపడింది అన్నప్పుడే చంద్రబాబు విశ్రమించారు. కేవలం పది రోజుల్లో బాధితులకు సాయం కూడా ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు సీఎం. వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు కట్టిస్తానని.. దెబ్బతిన్న ఇళ్లకు రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే వారికి రూ.10 వేలు, ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారికి రూ.10 వేలు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వ్యాపారులు, మత్స్యకారులు, రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఇలా ప్రతి ఒక్కరికి విడివిగా సాయం ప్రకటించారు సీఎం.

సహజంగా వరదలు, ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపైకి వస్తారు. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్ధితులు లేవు. వరదలో బురద రాజకీయాలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలు చెబుతూ, అవగాహన లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. దీనికి రాజధానిని లింక్ పెట్టారు. తొలి నుంచి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం ఇష్టం లేని జగన్ తాజా వరదలపై తన మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. చంద్రబాబు తన ఇల్లు మునిగిపోకుండా కాపాడుకునేందుకే ముందస్తు హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారని జగన్ తన అవగాహన లేమిని ప్రదర్శించారు. కృష్ణానదికి రిటైనింగ్ వాల్‌ను నిర్మించిన ఘనత తనదేనని.. తాను ఆ పని చేయకుంటే మరింత నష్టం సంభవించేదని చెప్పుకొచ్చారు. కానీ ఆ రిటైనింగ్ వాల్‌కు రూపకల్పన, శంకుస్థాపన, పనులు ప్రారంభించింది చంద్రబాబు అన్నది కృష్ణలంక వాసులకు తెలియదనుకున్నారు జగన్. దీంతో టీడీపీలో హయాంలో సగంపైగా పూర్తయిన రిటైనింగ్ వాల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో జగన్ బ్యాచ్ నాలుక కరచుకుంది.

74 ఏళ్ల వయసులో చంద్రబాబు నడుము లోతు నీటిలో అర్ధరాత్రుళ్లు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే.. యువకుడైన జగన్ మాత్రం కాసేపు నీళ్లలో దిగి , ఫోటోలకు ఫోజులతో సరిపుచ్చి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో సీఎంగా పగ్గాలు చేపట్టడంతోనే అమరావతి డేంజర్ జోన్‌లో ఉందని , ఎప్పటికైనా మునిగిపోతుందని ప్రచారం చేశారు జగన్. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ఆయన అధికారం కోల్పోయినా అదే అక్కసు వెళ్లగక్కుతున్నారు. రాజధాని మునిగిపోతే హైకోర్టు, సచివాలయం ఎలా పనిచేస్తున్నాయనే దానిపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారు జగన్. ఈ క్రమంలో నిపుణుల కమిటీ నివేదిక వైసీపీ బ్యాచ్‌కు చెంప చెళ్లుమనిపించింది. అమరావతిలోని హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాలకు ఎలాంటి ఢోకా లేదని చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు తేల్చిచెప్పడంతో జగన్ బ్యాచ్ షాక్ తగలగా.. చంద్రబాబుకు ఇక్కడా మార్కులు పడ్డాయి.

బుడమేరు గురించి విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు దాని గురించి తెలిసే అవకాశం లేదు. ఇంకేముంది చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండేందుకే బుడమేరు గేట్లు ఎత్తేశారని అబద్ధం చెప్పారు. తీరా జనం చీవాట్లు పెట్టే సరికి సైలెంట్ అయ్యారు. బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద దాదాపు పాతికేళ్ల కిందట కట్టిన మినీ హైడల్ ప్లాంట్ కారణమంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే కృష్ణానదికి వరదలు వస్తే బుడమేరు నీరు నదిలోకి వెళ్లే అవకాశం లేదు, అలాగే నదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. బుడమేరు విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించి. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన గండ్లు పడిన ప్రాంతాల వద్దే గడిపారు. మూడు రోజులకు పైగా నిద్ర లేకుండా గొడుగు కిందే ఆశ్రయం పొంది పనులను పర్యవేక్షించారు. గండ్లు పూడే వరకు విశ్రమించేది లేదన్నట్లుగా మొండిగా పనిచేశారు. నిమ్మల కృషి వల్లే మరింత వరద ఊళ్లలోకి రాలేదని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.

బెజవాడ పూర్తిగా మునిగిపోయి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోలేదు.. రాజధాని మునిగిపోలేదు, చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదు.. పైగా ప్రభుత్వ పనితీరును ప్రజలు మెచ్చుకుంటూ ఉండటం ఇవన్నీ జగన్ అండ్ కోకు ఏమాత్రం రుచించలేదు. ఈ బురద రాజకీయం మధ్యలో , లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తున్న దశలో భారీ బోట్లు కొట్టుకొచ్చి పిల్లర్లను ఢీకొట్టడంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బరాజ్‌కు దాదాపు 11.50 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. ఆ ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి 5 బోట్లు కూడా కొట్టుకొచ్చి.. ఒక బోటు మాత్రం ప్రవాహంలోనే కొట్టుకుపోగా.. నాలుగు మాత్రం బ్యారేజీ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే చిక్కుకుకుపోయాయి. ఈ ప్రమాదం కారణంగా పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ విరిగిపోయింది.

ఈ బోట్లు మీవంటే , మీవీ అంటూ టీడీపీ – వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రకాశం బరాజ్‌కు బోట్లు కొట్టుకొచ్చిన ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానంతో జలవనరుల శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేడయం దుమారం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఉషాద్రి, కోమటి రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. బోట్లను ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని.. బోట్లు కొట్టుకుపోయినా యజమానులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అనిత ప్రశ్నించారు. ఎన్నడూ లేనివిధంగా గొల్లపూడి వైపు బోట్లను ఎందుకు పార్క్ చేశారన్న ఆమె.. నిందితుల కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు.. ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాదాపు 11 రోజుల పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చినా, నిపుణుల వ్యూహాలు రచించినా ఫలించలేదు. చివరికి కాకినాడకు చెందిన అబ్బులు టీమ్, బెకమ్ కంపెనీ , విశాఖకు చెందిన సీ లయన్ సంస్థ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఒక బోటుని తొలగించగలిగారు. నేడో రేపో నీటిలో మిగిలిపోయిన బోట్లను కూడా తొలగిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ శ్రేణులు బెజవాడ వరదలను రాజకీయం చేయాలని ట్రై చేసి చేతులు కాల్చుకుంది. ప్రతిపక్షం ఎంతగా ప్రయత్నించినా ఎక్కడా తొణకకుండా , బెణకకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంతో పాటు రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus