తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎప్పటికప్పుడు ముదిరిపోతూ ఉంటుంది. బాలీవుడ్ నటులు, నటీమణులు ఈ అంశంపై ఎప్పుడూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ (Fatima Sana) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఒక సినిమా చేసిన అనుభవంతో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని ఆమె చెప్పడం, ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
ఓ ఇంటర్వ్యూలో ఫాతిమా (Fatima Sana) మాట్లాడుతూ, అన్ని ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని, తాను కూడా దీనిని అనుభవించాల్సి వచ్చిందని వెల్లడించింది. “సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటే, బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్మా. నిజంగా కొందరికి ఆ మాట పనిచేసింది. ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే సినిమా చేశాక నేను మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ తర్వాత ఓ పెద్ద నిర్మాత దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనతో అసభ్యమైన అనుభవం ఎదురైంది” అని చెప్పింది.
అయితే ఆ నిర్మాత పేరు బయటపెట్టలేనని, కానీ తనని డైరెక్ట్‌గా క్యాస్టింగ్ కౌచ్‌కు ప్రలోభ పెట్టారని ఫాతిమా ఆరోపించింది. “ఏం చెప్పినా చేయాలని ఆయన అన్నారు. సినిమా విషయమై ఏదైనా చెబితే నేను వినడానికి రెడీ అని చెప్పాను. కానీ అది కాకుండా వేరే విషయాల గురించి అసభ్యంగా మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశా” అని తెలిపింది. “నేను చాలా ఆఫర్లను క్యాస్టింగ్ కౌచ్ వల్ల వదులుకున్నాను. డైరెక్టర్లు, నిర్మాతలు రెమ్యునరేషన్‌లో 15 శాతం కట్ చేస్తారని తెలుసుకున్నా. అసలు నాకు (Fatima Sana) ఇస్తున్న రెమ్యూనరేషన్‌లోనే కోతపెడతారు.
ఎందుకు? అని అడిగితే – ‘ఇది ఇండస్ట్రీ రూల్’ అనే సమాధానం ఇచ్చేవారు. అలాంటి అనుభవాలు కలవారికి మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎంత దారుణమో అర్థమవుతుంది” అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే టాలీవుడ్ మొత్తం ఇలానే ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు అని కొందరు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు తలెత్తినా, నిజంగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.