Dasara Review in Telugu: దసరా సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 31, 2023 / 04:46 PM IST

Cast & Crew

  • నాని (Hero)
  • కీర్తి సురేష్ (Heroine)
  • జరీనా వహాబ్ , సముద్రఖని (Cast)
  • శ్రీకాంత్ ఓదెల (Director)
  • సుధాకర్ చెరుకూరి (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • సత్యన్ సూర్యన్ (Cinematography)

“అంటే సుందరానికి” తర్వాత నాని ఊరమస్ మేకోవర్ తో నటించిన సినిమా “దసరా”. సుకుమార్ వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని చాలా కాన్ఫిడెంట్ గా “2023 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న గొప్ప సినిమా దసరా” అని చెప్పడం ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఆ హైప్ ను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: తెలంగాణలోని వీర్లపల్లి అనే గ్రామంలో దోస్తులతో కలిసి మందు కొడుతూ.. డబ్బు కోసం ట్రైన్ లో బొగ్గు దొంగతనం చేస్తూ చాలా సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు ధరణి (నాని). తన సగం గుండె లాంటి స్నేహితుడు సూరి (దీక్షిత్ శెట్టి) కోసం తాను ఎంతో ఇష్టపడ్డ వెన్నెల (కీర్తిసురేష్)ను కూడా వదిలేసుకుంటాడు.

పచ్చని పైరులాంటి ధరణి-సూరిల స్నేహం.. ఊరి పెద్ద కొడుకైన చిన్న నంబి (షైన్ టామ్ చాకో) కారణంగా మసిబారుతుంది. ఆ మసి నుండి ధరణి మళ్ళీ సూర్యుడిలా ఎలా ఎదిగాడు? అనేది “దసరా” కథాంశం.

నటీనటుల పనితీరు: నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ధరణి పాత్రలో ఎంతో సహజంగా నటించడమే కాక, బాడీ లాంగ్వేజ్ ను కూడా సినిమాకి తగ్గట్లుగా మార్చుకున్న తీరు ప్రశంసనీయం. నాని కెరీర్లో ధరణి పాత్ర, ఆ పాత్రలో నాని నటన ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ ఒదిగిపోయింది. ముఖ్యంగా స్వచ్చమైన తెలంగాణ యాసలో ఆమె స్వంత డబ్బింగ్ పాత్రకి బాగా ప్లస్ అయ్యింది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. స్నేహితుడి కోసం ప్రాణం పెట్టే పాత్రను చాలా హుందాగా పోషించాడు.




మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. స్క్రీన్ ప్రెజన్స్ పరంగా విలనిజాన్ని బాగానే పండించినప్పటికీ.. చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ కి లిప్ సింక్ లేకపోవడం, ఇంకొన్ని సందర్భాన్ని సన్నివేశానికి, ఎమోషన్ కి మ్యాచ్ చేసే ఎక్స్ ప్రెషన్ ఇవ్వకపోవడంతో.. అతడి విలనిజం పండాల్సినంతగా అవ్వలేదు. సముద్రఖని, సాయికుమార్, ఝాన్సీ, రవితేజ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.




సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు ఓదెల శ్రీకాంత్ కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. ప్రతి సన్నివేశంలో సహజత్వాన్ని తీసుకురావడానికి అతడు తీసుకున్న జాగ్రత్తలు, సన్నివేశాల్లో ఎమోషన్ ను మరీ ఎక్కువగా డ్రమటైమ్ చేయకుండా.. సింపుల్ గా ఎలివేట్ చేసిన తీరు అభినందనీయం. ముఖ్యంగా.. ధరణి వచ్చి వెన్నెలకు తాళి కట్టినప్పుడు కాకులు వచ్చి అన్నం ముట్టడం చూపించి, చాలా పెద్ద ప్రశ్నకు, సింపుల్ & లాజికల్ ఆన్సర్ ఇచ్చాడు. అలాగే.. ఇంటర్వెల్ బ్లాక్ కోసం హడావుడిగా పెద్ద ఫైట్ డిజైన్ చేయకుండా..




ఎమోషనల్ గా చూపించడం బాగుంది. కాకపోతే.. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ను ఎక్కువగా సాగదీయడం సినిమాకి మైనస్ గా మారింది. కథకు అవసరమైన ల్యాగ్ ఉండడం వేరు, పాత్రల నడుమ డ్రామాను ఎలివేట్ చేయడం కోసం లెంగ్త్ పెంచడం వేరు. కానీ.. హీరో & విలన్ నడుమ ఎలాంటి వైరాన్ని & ఎమోషన్ ను ఎలివేట్ చేయకుండా.. కేవలం క్లైమాక్స్ లో విలన్ ను చంపడం కోసం రన్ టైమ్ పెంచడం అనేది గమనార్హం. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే.. శ్రీకాంట్ ఓదెల బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఉండేవాడు.




సత్యన్ సూర్యన్ ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. శ్రీకాంత్ పేపర్ మీద రాసుకున్న కథను, తన కెమెరా యాంగిల్స్ & కలర్ గ్రేడింగ్ తో పతాక స్థాయికి తీసుకెళ్ళాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ & ఇంటర్వెల్ బ్లాక్ ను కంపోజ్ చేసిన తీరు బాగుంది.




సంతోష్ నారాయణన్ నుంచి ఆశించిన స్థాయిలో పాట్లు లేకపోయినా.. అతడి మార్క్ ర్యాప్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ లో యాడ్ చేసిన తీరు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ను కూడా మెచ్చుకోవాల్సిందే.




విశ్లేషణ: నటుడిగా నానిని మరోస్థాయికి తీసుకెళ్లే సినిమా “దసరా”(Dasara) . ఆడియన్స్ సెకండాఫ్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాన్ని బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంది. నిర్మాతకు బ్రేకీవెన్ తీసుకురావడానికి కమర్షియల్ 51 కోట్ల రూపాయలు కొల్లగొట్టాల్సి ఉన్న ఈ చిత్రం సాధించే ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అయితే.. నాని నటన, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కోసం మాత్రం ఈ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే.




రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus