ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ‘డియర్’ కూడా ఒకటి. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) హీరోగా చేసిన ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించడం వల్ల కొంతమంది ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా పై పడింది. మరి సినిమా వారిని ఆకట్టుకునే విధంగా ఉందో లేదో ఓ లుక్కేద్దాం రండి :
కథ: చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకుంటున్న వార్తలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. అలాంటి వాటి ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. విషయం ఏంటంటే.. అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) ఓ న్యూస్ రీడర్. అతను రోజూ టీవీలో కనిపించాలి. కాబట్టి…ముఖం ఫ్రెష్ గా ఉండాలని ప్రతి రోజూ 8 గంటలు పడుకోవాలని అతను డిసైడ్ అవుతాడు. అతను సెటిల్ అయ్యాడు అని భావించి ఇంట్లో వాళ్ళు అతనికి దీపిక (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. దీపికకి నిద్రపోతే గురక గట్టిగా పెట్టే బలహీనత ఉంటుంది. దీంతో అర్జున్ కి అది భారంగా మారుతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఒకరు ఒక నైట్ అంతా పడుకుంటే ఇంకొకరు మెలకువగా ఉండాలి.
అయితే ఓసారి అర్జున్ కి ఓ ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. అయితే దానికి ముందు రోజు నైట్ అంతా అతను నిద్ర పోడు. తన భార్యతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగం అనమాట. అయితే తర్వాతి రోజు ఆఫీస్ లో ఇంటర్వ్యూ చేసే టైంకి బాత్రూమ్ లో నిద్రపోతాడు.దీంతో అతని పరువు, ఉద్యోగం రెండూ పోతాయి. దీనికి కారణం అతని భార్య అని భావించి ఆమెకు విడాకులు ఇవ్వాలనే కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఓ పక్క అమ్మ (రోహిణి), అన్నయ్య (కాళి వెంకట్) సర్ది చెప్పినా వినడు. విడాకుల కేసు కోర్టులో ఉండగా దీపిక ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా కూడా మరికొన్ని హిట్లు కొట్టాడు. అయితే ఈ సినిమాలో అతని నటన ఎవ్వరికీ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే చాలా వరకు కామెడీ పండించే స్కోప్ ఆ పాత్రకి ఉన్నా జీవీ ప్రకాష్ దానిని వాడుకోలేకపోయాడు. అది డైరెక్షన్ లోపం అని కూడా ఇక్కడ చెప్పవచ్చు. ఇక హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఎంత టాలెంటెడో అందరికీ తెలుసు. కానీ ఆమె టాలెంట్ కి తగ్గ రోల్ అయితే కాదు ఇది.
అందుకే ఆమె సాదా సీదాగా కనిపిస్తుంది. హీరో తల్లిగా చేసిన రోహిణి తన మార్క్ నటనతో కాసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో అన్నయ్యగా కాళీ వెంకట్ కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు ఎవ్వరూ రిజిస్టర్ కారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ముందుగా ఇది షార్ట్ ఫిలింకి సెట్ అయ్యే కథ. అయినప్పటికీ దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ 2 గంటల 15 నిమిషాల సినిమాగా ఆవిష్కరించాలి అనుకున్నాడు. చిన్న చిన్న విషయాలకి కొంతమంది ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే పాయింట్ మంచిదే. కానీ కామెడీకి బోలెడంత స్కోప్ ఉంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఈ కథని చెప్పే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ‘టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్’ అనే పద్ధతిలో తీశాడు. అదే పెద్ద మైనస్ అయ్యింది.
మొత్తంగా డైరెక్షన్ పై కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మ్యూజిక్ పరంగా ఓకే. ఒక పాట బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఓకే. జీవీ ప్రకాష్ కి ఇక్కడ మంచి మార్కులు వేయొచ్చు. మరోపక్క సినిమాటోగ్రఫీ కూడా ఓకే. రెండు పాటలు రిచ్ గా కనిపించాయి. నిర్మాణ విలువల విషయంలో కంప్లైంట్ చేయలేము. కథకు తగ్గట్టు బాగానే నిర్మాతలు ఖర్చు చేశారు.
విశ్లేషణ: దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ.. ఆసక్తికరమైన కథ, కథనాలు లేకపోవడం వల్ల ‘డియర్’ బాగా బోర్ కొట్టిస్తుంది. రన్ టైం తక్కువే అయినప్పటికీ.. అంతసేపు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోపెట్టే విధంగా అయితే ఈ సినిమా లేదు.
రేటింగ్ : 1.5/5