ఏదైనా సినిమా విడుదలకు సిద్ధమవ్వడం ఆలస్యం… థియేటర్‌లోనా లేక ఓటీటీలోనా అనే ప్రశ్న మొదలవుతోంది. దానికి కారణం కరోనా తెచ్చిన పరిస్థితులే అని చెప్పొచ్చు. ఈ పరిస్థితి కేవలం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాదు, మొత్తం దేశంలో ఇలానే ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అయితే ఈ కారణం కాకుండా, వేరే రీజన్‌తో ఓ సినిమా ఓటీటీ బాట పడుతోందని సమాచారం. అయితే ఆ సినిమా బాలీవుడ్‌ది.
దీపికా పదుకొణె, అనన్య పాండే ముఖ్య పాత్రలో షకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. వీలున్నప్పుడల్లా చిత్రబృందం కూడా ఇదే మాట ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూనే ఉంది. ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు, ప్రేమ సన్నివేశాలు మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుందని, సెన్సార్ నుండి ఆ సీన్లు తప్పించుకొని రావడం కష్టమని చిత్రబృందం భావిస్తోందట.
అందుకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చర్చలు జరిపిందట. అందులో ఏదో ఒక దాంట్లో వచ్చే జనవరిలో సినిమాను విడుదల చేస్తారని టాక్. వివాహేతర బంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వాటి గురించి సున్నితమైన అంశాలను చర్చించే క్రమంలో కాస్త మోతాదు పెరిగిందంటున్నారు. ఓటీటీ అయితే సెన్సార్‌తో పెద్ద ఇబ్బంది ఉండదని షకున్ బత్రా అండ్ టీమ్ అనుకుంటోందట.