ఓ సినిమా నుండి హఠాత్తుగా తప్పుకొని గత కొంతకాంగా వార్తల్లో నిలిచిన ప్రముఖ కథానాయిక దీపికా పడుకొణె (Deepika Padukone) ఇప్పుడు మరో ఘనత సాధించి వార్తల్లో నిలిచింది. ఇండియన్ సినిమాలు, హాలీవుడ్ సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న దీపికకు ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికైంది. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ ఘనతను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక నిలిచింది. 35 మందితో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించిన జాబితాలో ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ ప్రముఖ హాలీవుడ్ నటీమణులు డెమి మూర్, రాచెల్ మెక్‌ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ తదితరరులు ఉన్నారు.వినోదరంగంలో చేసిన కృషికి గాను వీరిని ఎంపిక చేసినట్లు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
దీపిక ఘనతల విషయానికొస్తే.. 2018లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్’ జాబితాలో చోటు దక్కించుకుంది. 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా తనెంత పాపులరో చెప్పకనే చెప్పింది. ఇక 2023 ఆస్కార్ ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని నాటునాటుని వరల్డ్ వైడ్ ఆడియన్స్‌కు ఆ వేదిక మీద పరిచయం చేశారు. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆమె ఇచ్చిన ఎలివేషన్, ఇంట్రడక్షన్ ఇప్పటికీ భారతీయుల చెవుల్లో మారుమోగుతోంది.
ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో ఆమెనే కథానాయిక. ఇందులో యోధురాలి పాత్రలో దీపిక కనిపించబోతోందట. ఇది కాకుండా నాగ్ అశ్విన్ – ప్రభాస్‌ల ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.