టాలీవుడ్ చరిత్రలో ఒక్కో దశలో..ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో పౌరాణికాలు, సాంఘీకాలు, జానపద చిత్రాలు, రాజకీయ కధ భరిత చిత్రాలు, అమ్మ, చెల్లెలు, అన్నా, తమ్ముడు సెంటిమెంట్ తో చాలా సినిమాలే వచ్చాయి. ప్రేక్షకులు కూడా భారీ వసూళ్లను అందించి మంచి హిట్స్ గా మలచి ఆ సినిమాలను బాగా ఆస్వాదించారు. అయితే ఆతరువాత 90వ దశకంలో ఫ్యాక్షన్ కధలకు ఆధ్యం పోశాడు నటసింహం నందమూరి బాలకృష్ణ, అప్పుడు ఊపు అందుకున్న ఆ ట్రెండ్ దాదాపుగా 10ఏళ్ళపాటు కొనసాగి మంచి ఫలితాలను ఇచ్చింది.
ఇక టెక్నాలజీ పెరగడం, టాలెంట్ ఉన్న రచయితలు, డైరెక్టర్స్ కు డిమాండ్ పెరగడంతో ఎన్నో రసభరితమైన కధలు మనల్ని అలరిస్తూ వస్తున్నాయి. ఈ కధ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మరోక ఎత్తు ఇప్పుడు బడా హీరోలందరూ నాన్న కధలపై పడ్డారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న వాదన. దీనికి ముందుగా ఆధ్యం పోసింది స్టైలిష్ స్టార్ బన్నీ…”సన్ ఆఫ్ సత్య మూర్తి”తో అయితే ఆ ట్రెండ్ కు ప్రాణం పోసి ముందుకు నడిపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం “నాన్నకు ప్రేమతో”.
టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం బన్నీ సత్య మూర్తి, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రెండు సినిమాలు ఒకింత దగ్గర కధతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అందులో బన్నీ సినిమా ఓకే అనిపించినప్పటికీ..పెద్దగా హిట్ కాలేదు. ఇక ఎన్టీఆర్ నాన్నకు విషయమే తీసుకుంటే సినిమాకు తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం 50కోట్లకు పైగా వసూళ్లు సాధించడం హర్షించదగ్గ విషయం. ఇక ఈ రెండు సినిమాల పుణ్యమా అంటూ మిగిలిన బడా హీరోలు కూడా ఇలాంటి కధల కోసం దర్శకులపై, తమ తమ, ఆస్థాన రచయితలపై ఒత్తిడి తెస్తున్నట్లు వినికిడి. మరి ఈ ట్రెండ్ ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూద్దాం.