ఓ సినిమాకు థియేటర్లలో బజ్ తీసుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఆ సినిమా ఓటీటీలోకి వచ్చాక నెగిటివిటీ, నిజాలను దాచడం మాత్రం చాలా కష్టం. ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే ‘దేవర’ (Devara) టీమ్‌ను అడగండి బాగా వివరిస్తారు. ఎందుకంటే ఆ సినిమా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ ఆ రేంజిలో ఉంది. ఇలాంటి సినిమాను థియేటర్లలో ఎలా హిట్ చేశార్రా బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు.
చాల్లెండి ఊరుకోండి.. ఎవరో అన్నారు కదా అనుకుంటున్నారా. గతంలో థియేటర్లలో సినిమా వచ్చినప్పుడు చూసి అద్భుతంగా ఉందని ట్వీట్లు వేసిన వాళ్లు, తారక్ అభిమానులే అంటున్నారు మరి. ఎందుకంటే ముగ్గురు మనుషులు సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు.. ఇద్దరు వచ్చి బాగోలేదు అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అనడకుండా ఆగిపోతుంటారు. ఆ ఇద్దరే ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుతున్నారు అని అర్థమవుతోంది. కావాలంటే మీరే చూడండి సినిమాలోని లూప్ హోల్స్, కథలోని లూప్ హోల్స్ పట్టుకుని స్క్రీన్ షాట్లతో విరుచుకుపడుతున్నారు.
తాడు గాల్లో ఎలా వేలాడుతోంది, నీటిలో తిమింగలం లాగుతున్నప్పుడు తాడు స్టిఫ్‌గా ఎందుకుంది. దేవరకి చెల్లెలు అవ్వాల్సిన తంగమ్ ప్రేమలో ఎలా పడుతుంది అనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇక టేకింగ్, తారక్‌ను చూపించిన విధానంలో అయితే దర్శకుడు కొరటాల శివను (Koratala Siva) ఓ ఆటాడేస్తున్నారు నెటిజన్లు. దీంతో రెండు రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటి సినిమాకు సీక్వెల్ ఉంటుందా? ఉంటే ఎలా తీస్తారు? అని.
ఎందుకంటే ‘ఆచార్య’ (Acharya) సినిమాతో అథఃపాతాళానికి పడిపోయిన తన క్రేజ్‌ను కొరటాల శివ ఇప్పుడిప్పుడే మళ్లీ పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ‘దేవర’ ఓటీటీ కష్టం మళ్లీ ఇబ్బంది పెట్టంది. కాబట్టి ‘దేవర 2’ ఆయన రెండు కత్తుల మీద సాము అని చెప్పాలి. మరోవైపు సినిమాకు భారీ కలెక్షన్ పోస్టర్లు వేసి అభిమానులను అలరించిన సినిమా నిర్మాణ / విడుదల టీమ్.. ఓటీటీ దగ్గరకు వచ్చేసరికి అలాంటి ప్లాన్స్ ఎందుకు చేయలేదు అని అంటున్నారు.