మెగాఫోన్ పట్టిన ధనుష్!

కొద్దిరోజుల క్రితం మామ, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నానన్న ఆసక్తికర వార్తతో అందరి దృష్టినీ ఆకర్షించిన ధనుష్ ఇప్పుడు మరో విషయమై సినీ నగరిలో విహరిస్తున్నాడు. పద్నాలుగేళ్ల తన సినీ కెరీర్లో ముప్పై సినిమాల్లో నటించిన ధనుష్ నిర్మాతగా, గాయకుడిగా, గేయ రచయితగాను ప్రేక్షకుల మన్ననలు పొందారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టి కెప్టెన్ కుర్చీ ఎక్కేశారు.

ప్రముఖ తమిళ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో ‘పవర్ పాండి’ సినిమాని తెరకెక్కిస్తోన్న ధనుష్ నిన్ననే ఆ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఒకరోజు షూటింగ్ ని కూడా పూర్తి చేసేశారు. అదేరోజున ఫస్ట్ లుక్ సైతం విడుదల చేయడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా తొలిచిత్రంలోనూ రాజ్ కిరణే హీరో. ‘పందెంకోడి’, ‘ముని’ సినిమాలతో ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచుతుడే. కాగా ప్రసన్న (స్నేహ భర్త), ఛాయా సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందిస్తుండగా, విఐపి చిత్ర దర్శకుడిగా మారిన వేల్ రాజ్ ఛాయాగ్రాహకుడు. ఇక నటుడిగా ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన ‘తొడరి’తో పాటు ‘కొడి’ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోన్న ధనుష్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తోన్న ‘యెన్నై నొక్కి పాయుమ్ తొట్ట’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తవగానే ధనుష్-వెట్రిమారన్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వడ చెన్నై’ మొదలవనుంది.

https://www.youtube.com/watch?v=8eC4lof8JRY

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus