Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’.. ఈసారి నిజంగానే వస్తుందా?

తమిళ సినీ ఇండస్ట్రీలో ‘ధృవ నక్షత్రం’  (Dhruva Natchathiram) సినిమా పేరు ఏళ్లతరబడి వినిపిస్తూనే ఉంది. విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ మీనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయినా, ఇంకా విడుదలయ్యే పరిస్థితి లేదు. ఏటా ఏదో ఒక కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వస్తున్న గౌతమ్ మీనన్.. తాజాగా మే 1న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు వచ్చిన అనుభవాలను బట్టి జనాలు మాత్రం ఆ ప్రకటనను పెద్దగా పట్టించుకోవడంలేదు. కాస్త వెనక్కి వెళ్తే.. ‘ధృవ నక్షత్రం’ మొదట 2017లో అనౌన్స్ చేశారు.

Dhruva Natchathiram

ఆర్థిక ఇబ్బందుల వలన అప్పటి నుంచి రిలీజ్ డేట్ అనేకసార్లు మారుతూ వచ్చింది. 2023లో థియేటర్లలోకి రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కానీ విడుదలకు కొన్ని రోజుల ముందు వాయిదా పడిపోయింది. అలా అర్ధంతరంగా పోస్ట్‌పోన్ కావడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతారా? లేక ఈసారి నిజంగానే థియేటర్లలోకి తెస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా అనేక సినిమాలు చేస్తూ వచ్చిన డబ్బును ‘ధృవ నక్షత్రం’ రిలీజ్ కోసం వెచ్చిస్తున్నారని సమాచారం. కోలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం, సినిమా విడుదల కోసం ఆయన ప్రస్తుతం నటనపై ఫోకస్ పెంచారని, వచ్చే ఆదాయాన్ని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. అయినా సరే, అసలు మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం మాత్రం వీడటం లేదు.

ఈసారీ రిలీజ్ డేట్ ప్రకటించగానే నెటిజన్లు ‘‘మాకు నమ్మకం లేదు దొరా’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నిసార్లో రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేసినందుకు గౌతమ్ మీనన్‌పై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా విక్రమ్ మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఆ విషయం గమనిస్తే, ఆయనకే సినిమా విడుదలపై నమ్మకం లేదేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా ప్లాన్ చేశారు.

మే 1న మొదటి పార్ట్ విడుదల చేస్తే, ఆ వెంటనే రెండో పార్ట్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటికి ఒక పార్ట్‌కే ఇన్ని సమస్యలు ఎదురైతే, రెండో పార్ట్ పరిస్థితి ఏంటి? అన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈసారి గౌతమ్ మీనన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? లేక మళ్లీ సినిమా వాయిదా పడుతుందా? అనేది వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus