Dhurandhar : ఇండియన్ సినిమా లో ఒకప్పుడు సంచలనాత్మక చిత్రాలను డైరెక్ట్ చేసి సినీ రంగంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV). ఈ మధ్య హిట్లు లేకపోయినా కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఈ దర్శకుడు. అయితే ఆయనకు సినిమా మీద ఉన్న అభిమానం మాత్రం వేరే. మూస ధోరణిలో ఒకటే ఫార్ములాతో వచ్చే మూవీల పట్ల ఆయన అంత ఇంట్రెస్ట్ చూపరు కానీ, విభిన్న కదాంశాలతో మూవీస్ వచ్చినప్పుడు మాత్రం ఆర్జీవీ పొగడ్తలతో ముంచెత్తుతారు. అదే విధంగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దురంధర్’ పై పొగడ్తలు కురిపిస్తూనే పాన్ ఇండియా దర్శకులకి చురకలు అంటించాడు వర్మ.
ఎలివేషన్లు, స్లోమోషన్ షాట్లు, చెవులు చిల్లులు పడే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా స్వభావాన్నే మార్చేస్తున్న ట్రెండ్‌పై ఆయన ఎన్నిసార్లు విమర్శలు చేశారో తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ సినిమాను నిజంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లిందని ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ధురంధర్ ప్రత్యేకత ఏంటంటే… హీరోని దేవుడిలా చూపించలేదు. బలవంతపు ఎలివేషన్ సీన్లు లేవు. హీరో లోపాలు, వాటి పరిణామాలు సహజంగా కథలో కలిసి సాగుతాయి. ప్రేక్షకుడిని చప్పట్లు కొట్టించడానికి కాదు, ఆలోచింపజేయడానికి సినిమా ప్రయత్నిస్తుంది. స్టార్ అయిన రణ్‌వీర్ సింగ్, కథ అవసరమైతే వెనక్కి తగ్గి అక్షయ్ ఖన్నాకు స్క్రీన్ స్పేస్ ఇవ్వడం… సినిమా మీద ఉన్న అవగాహనకు నిదర్శనమని ఆర్జీవీ అన్నారు.
ఇంకో ముఖ్యమైన విషయం.. ఈ సినిమా మాట్లాడదు, మౌనంగా చెబుతుంది. దీర్ఘమైన నిశ్శబ్దాలు, ఇతర సినిమాల్లో పేజీల కొద్దీ డైలాగులు చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తాయి. వయోలెన్స్ కూడా ఇక్కడ వినోదం కాదు, ఒక మానసిక దెబ్బ. ప్రతి దెబ్బకి భావోద్వేగ భారం ఉంటుంది. సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా హీరోలా పనిచేస్తాయి. ఎప్పుడు ఫీల్ అవ్వాలో చెప్పవు, అనుభవించమంటాయి. జానర్ పరిమితులను చెరిపేసి, రాజకీయ థ్రిల్లర్, క్యారెక్టర్ స్టడీ, యాక్షన్, మోరల్ ట్రాజెడీగా మారుతూ సాగుతుంది.
“ధురంధర్ ఒక బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు… ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక. ఇకనైనా గ్రో అవ్వాలి” అంటూ ఆర్జీవీ ఫిల్మ్ మేకర్స్‌కి గట్టిగానే చురకలు అంటించాడు అని మాట్లాడుకుంటున్నారు సినీ అభిమానులు.