తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితలకు సరైన గుర్తింపు ఉండటం లేదన్న సమస్య ఎప్పటినుండో వింటూ వస్తున్నదే. ఈ కారణంగా కొంతమంది కసితో దర్శకులుగా మారుతుంటే మరికొందరు పోరు సాగించలేక పక్కకు తప్పుకుంటారు. ఫలితంగా రచయితల కొరత అన్న సమస్య ఏర్పడుతుంది. దీనిపై మాటల రచయిత డైమండ్ రత్నబాబు ఇటీవల పెదవి విప్పారు.
సినిమాకి సంబంధించి అన్ని విభాగాలను ఒకేతాటికి తెచ్చే దర్శకుడు “కెప్టెన్” అయినా కథ, కథనాలు అందించే రచయిత దిక్సూచి వంటివాడన్నా రత్నబాబు రచయితలకు తగిన గుర్తింపు వుండట్లేదన్నారు. మాటల రచయితగా “సీమ శాస్త్రి, పిల్ల నువ్వు లేని జీవితం” వంటి సినిమాలకి పనిచేసిన ఈయన ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న ‘లక్కున్నోడు’ సినిమాకి స్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా త్వరలో మెగాఫోన్ పెట్టనున్నట్టు తెలిపిన రత్నబాబు “బాహుబలి” దర్శకుడెవరన్నది తెలిసినంతగా ఆ సినిమా మాటల రచయిత పేరు తెలీడం లేదంటూ “సేవ్ రైటర్ – సేవ్ సినిమా” అని పిలుపునిచ్చారు.