సమస్య ఒకటే… దానిని క్లియర్ చేయడానికి వాళ్ల అప్రోచ్‌లో తేడా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. సమస్య టాలీవుడ్ కష్టాలు అయితే, దానికి తొలగించే ప్రయత్నం చేస్తోంది మెగా హీరోలు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే చిరంజీవి, పవన్ కల్యాణ్. ఏపీలో తెలుగు సినిమా పడుతున్న ఇబ్బందుల గురించి మీరు ఇప్పటికే చాలా చదివే ఉంటారు. వాటి సంగతి తేల్చడానికి హీరోలు ఎవరూ ముందుకు రాని సందర్భంలో చిరంజీవి వచ్చారు. ఆ తర్వాత ఇటీవల పవన్ గళమెత్తారు.
చిరంజీవి ఏ పని మొదలెట్టినా ఇండస్ట్రీ నుండి సపోర్టు వస్తుంది. అయితే అది అంతంతమాత్రమే. కొంతమంది మాత్రం చిరు వెనుక నడుస్తారు. ఆ తర్వాత వచ్చే ఫలాలను మాత్రం అందరూ అనుభవిస్తారు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు టాలీవుడ్ కష్టాలను చూసి… ‘లవ్‌స్టోరీ’ ప్రిరిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి ఇదే కోరుకున్నారు. ప్రభుత్వాలను ‘సినిమా కష్టాలు’ చూడండి అంటూ కోరుకున్నారు. కట్ చేస్తే ‘రిపబ్లిక్’ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కూడా ఇదే అన్నారు. కానీ వాయిస్ అగ్రెసివ్‌గా కనిపించింది.
రెండింటినీ కలిపి చూస్తే… అప్పుడు చిరంజీవి అడిగింది, ఇప్పుడు పవన్ కల్యాణ్ అడిగిందీ ఒకటే. చిరంజీవి విషయంలో ఏపీ ప్రభుత్వంలో ఎవరి నుండీ విమర్శలు రాలేదు. కానీ పవన్‌ను విమర్శిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు గమనించొచ్చు. ఒకటి ఆయన వాయిస్‌లో అగ్రెసివ్ నెస్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడం. లేదా ఆయన రాజకీయ నేపథ్యం. పవన్ సినిమా పరిశ్రమ గురించి చేసిన కామెంట్స్… వాళ్లు రాజకీయంగా ఎదుర్కొంటున్నారు అంతే. అన్న సయోధ్య చేస్తుంటే, తమ్ముడు యుద్ధం ప్రకటించాడు అంతే.
ఎవరు ఎలా చేసినా… ఆఖరికి కావాల్సింది తెలుగు సినిమా కష్టాలు తీరడం. పన్నులతో ప్రభుత్వాలు నడుస్తాయనేది ఎంత వరకు నిజమో, టికెట్ల అమ్మకాలతో సినిమాలు నడుస్తాయనేది అంతే నిజం. టికెట్ ధర తగ్గించి, షోలు తగ్గించి, జనాల ఆక్యుపెన్సీ తగ్గించి… సినిమాలు వేసుకోండి మేం అడ్డు చెబుతున్నామా అంటే ఎలా. అయినా సినిమా కష్టాల గురించి చిరంజీవి నెమ్మదిగా మాట్లాడినా ముందుకు రాని సపోర్టు, పవన్ కల్యాణ్ గట్టిగా అరిస్తే వస్తుందా? ఆయన ఆశ కాకపోతే.