సినిమా విడుదలవ్వాలి, ఆ తర్వాత దానికి రివ్యూలు రావాలి, అవి చదివాక ఆ సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఇదంతా ఒక ప్రాసెస్. గతకొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది, భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఆర్డర్‌లో మార్పులు జరిగితే సినిమాకు, నిర్మాతకు తద్వారా చిత్రపరిశ్రమకు నష్టం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్‌లో ఆర్డర్ మారి సినిమా రిలీజ్‌కు ముందే రివ్యూలు రాసేశారు కొంతమంది నెటిజన్లు.
దీంతో ఆ విషయం ఇప్పుడు సైబర్ క్రైమ్ వరకు వెళ్లింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్ (Parasuram) రూపొందించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’ (The Family Star) మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రానికి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ వ్యాఖ్యలు, పోస్టులు చేశారట. ఈ మేరకు దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్ దేవరకొండ టీమ్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ వింగ్‌లో ఫిర్యాదు చేసింది.
ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని విజయ్ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది. ఆ పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోస్టులకు స్క్రీన్ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో ఈ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమా మీద అంత కసి ఎవరికి ఉంది అంటూ చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
నిజానికి నిర్మాత దిల్‌రాజు ఇదివరకే ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పుడు విజయ్ టీమ్ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.