అగ్ర నిర్మాతైన దిల్ రాజు బ్యానర్ లో ఎప్పుడూ నాలుగు సినిమాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. సగటున మూడు నెలలకు ఒకటనుకున్నా సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆయన సినిమాలు తెరపై కనువిందు చేయాల్సిందే. ఇక పంపిణీ రూపేణా మరికొన్ని ఎటూ ఉంటాయి. అయితే 2016లో మాత్రం దిల్ రాజు పేరు అంతగా మార్మోగలేదు.క్యాలెండర్ మారిన కొత్తల్లో వచ్చిన ‘కృష్ణాష్టమి’ రాజుకి పెట్టుబడి కూడా వెనక్కి తీసుకురాకపోగా అక్కడికి మూడు నెలల తర్వాత వచ్చిన ‘సుప్రీమ్’ కాస్త సంతృప్తిని మిగిల్చింది. పంపిణీ పరంగా ‘జనతా గ్యారేజ్’ లాభాలు తీసుకొచ్చినా ‘ఇజం’ వల్ల ఒరిగిందేమీ లేదు. తమిళంలో విజయవంతమైన ‘రెమో’ త్వరలో తెరమీదికి రానుంది. అయితే వచ్చే ఏడాది మాత్రం థియేటర్లలో ‘దిల్’ రాజు పేరు నెలకోసారి కనపడుతుంది. ఆ లెక్కేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం..!
దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమా త్వరలో తెరమీదికి రానుంది. దాంతోపాటు 2017ని నాని నటించిన ‘నేను లోకల్’ సినిమాతో స్వాగతించనున్నారు ఈ సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ నాటికి విడుదల కానుంది. అగ్ర హీరోలున్నా సంక్రాంతి పండగను వదులుకోడం ఇష్టం లేని రాజు శర్వానంద్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ చిత్రంతో 2017 జనవరిలో సందడి చేయనున్నారు.
ఫిబ్రవరిని వరుణ్ తేజ్ ‘ఫిదా’ కోసం ఫిక్స్ చేయగా ఇప్పుడు దీనిపై ఏం మాట్లాడలేని పరిస్థితి. వరుణ్ అనుకూలతను బట్టి ఈ సినిమా విడుదల ఉంటుంది. తర్వాతి నెల అయినా మార్చ్ లో మణిరత్నం సినిమా ‘డ్యూయెట్’ రానుంది. ఈ హక్కులు ఇప్పటికే దిల్ రాజు సొంతం అయ్యాయి. ఇక ఏప్రిల్ తో వేసవి సందడి షురూ కానుంది. సమ్మర్ అంటే స్టార్ హీరోల సినిమాలు ఉండాల్సిందే. అందుకే ఈ సీజన్ ని అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా కోసం కేటాయించారు దిల్ రాజు. అలా 2016 కి సెండాఫ్ ఇవ్వడం దగ్గర్నుండి 2017కి వెల్కమ్ పలికి వేసవి సీజన్ వరకు తన క్యాలెండర్ పూరించారు ఈ విజన్ ఉన్న ప్రొడ్యూసర్. ఇప్పటికివే కానీ ఈ నాలుగు నెలలు ముగిసే లోపు మిగతా ఎనిమిది నెలలకు సరిపడా ముహుర్తాలు పెట్టేస్తారన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.