“క” సినిమాతో సక్సెస్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. అతడి నుండి వచ్చిన తాజా చిత్రం “దిల్ రుబా” (Dilruba). విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం విడుదల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే.. పాటలు మంచి హిట్ అవ్వడం, ప్రమోషనల్ కంటెంట్ జనాల్లోకి వెళ్లడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏస్థాయిలో అలరించిందో చూద్దాం..!!
కథ: సిద్ధు (కిరణ్ అబ్బవరం) ఒకేరోజు తాను గౌరవించే తండ్రిని, చిన్నప్పటి నుంచి ప్రేమించిన మేఘన (క్యాతీ డావిన్సన్)ను కోల్పోతాడు. అలా ఇద్దరు తన అనుకున్న మనుషులు దూరమవ్వడంతో.. ఇకపై ఎవ్వరికీ దగ్గరవ్వకూడదు అని నిశ్చయించుకొని మంగుళూరులోని కాలేజ్ లో ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ పరిచయమవుతుంది అంజలి (రుక్సార్). ఆమె పరిచయంతో సిద్ధులో కొద్దిగా మార్పు వస్తుందనుకుంటున్న తరుణంలో.. అంజలి కూడా సిద్ధుని వదిలేసి వెళ్ళిపోతుంది.
అసలు ఇంతమంది సిద్ధుని వదిలేసి ఎందుకు వెళ్లిపోతారు? సమస్య ఎక్కడ ఉంది? సిద్ధు క్యారెక్టరా? లేక ఆటిట్యూడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: కిరణ్ అబ్బవరం తనలోని మాసీ యాంగిల్ ను ఈ సినిమాలో బాగా ప్రాజెక్ట్ చేశాడు. ముఖ్యంగా స్టైలింగ్ & బాడీ లాంగ్వేజ్ విషయంలో కొత్తదనం చూపించాడు. కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న కేర్ కిరణ్ ని స్టైలిష్ గా చూపించడానికి తోడ్పడింది. నటన విషయంలో కాస్త పూరీ హీరో మార్క్ కనిపించినప్పటికీ.. యూత్ కి కనెక్ట్ అయ్యే విధమైన పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
అంజలి పాత్రలో రుక్సార్ మంచి ఎనర్జిటిక్ గా కనిపించింది. అక్కడక్కడా లిప్ సింక్ మిస్ అయినా.. నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఆమె కెరీర్ కి ఈ సినిమా కాస్త పాజిటివ్ వైబ్ ఇవ్వడం ఖాయం. మరో కీలకపాత్రలో క్యాతీ డావిన్సన్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఆమె పాత్ర సరిగా వర్కవుట్ అవ్వలేదు. సత్య, జాన్ విజయ్ వంటి ఆర్టిస్టులను సరిగా వినియోగించుకోలేదు. క్రాంతి కిల్లి స్టైలిష్ విలన్ గా అలరించే ప్రయత్నం చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగ్గొట్టాడు. కేసిపిడి పాట మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ కి ఇచ్చిన బీజియం సినిమాకి మంచి కిక్ ఇచ్చింది. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ వర్క్ ను మెచ్చుకోవాలి. ప్రతి ఫ్రేమ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. కలర్ కాంబినేషన్ పరంగా అతడు తీసుకున్న జాగ్రత్తలు మంచి వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చింది. అలాగే.. యాక్షన్ బ్లాక్ ను డిజైన్ & కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ మాస్ ఆడియన్స్ ను అలరించింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు అనిపించింది. కాలేజ్ ఎపిసోడ్స్ లో ల్యాగ్ ఎక్కువైంది. అలాగే.. క్లైమాక్స్ ఫైట్ ను కాస్త స్పీడప్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేది.
దర్శకుడు విశ్వ కరుణ్ మీద పూరి జగన్నాథ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అది స్పష్టంగా కనిపించింది. ప్రెజెంట్ లవర్ విషయంలో హెల్ప్ చేయడానికి ఎక్స్ లవర్ మళ్లీ ఒక అబ్బాయి జీవితంలోకి రీఎంట్రీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ లో బలం ఉన్నప్పటికీ.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం సరిగా ల్యాండ్ అవ్వలేదు. షాట్ మేకింగ్ & ఎమోషన్స్ విషయంలో స్టేజింగ్ అనేది చాలా కీలకం ఆ విషయంలో విశ్వ కరుణ్ సరైన జాగ్రత్త తీసుకోలేదు. అందువల్ల సన్నివేశాలు బాగున్నా.. చాలావరకు పండలేదు. ఆ కారణంగా కథకుడిగా, దర్శకుడిగా విశ్వ కరుణ్ పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: ప్రేమకథల్లో ఎన్నో రకాలు. ఒక్కో ప్రేమది ఒక్కో ఎమోషన్. అయితే.. ఆ ఎమోషన్ ను సరిగా పండించగలగడం, మరీ ముఖ్యంగా ఆడియన్స్ ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయ్యేలా చేయగలగడం అనేది ఒక లవ్ స్టోరీ సక్సెస్ లో కీరోల్ ప్లే చేస్తుంది. “దిల్ రుబా” (Dilruba) ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. ఫైట్ సీన్స్ బాగున్నా.. వాటిలోని ఇంటెన్సిటీకి మ్యాచ్ అయ్యే స్థాయి సన్నివేశాలు లేకుండాపోయాయి. అలాగే.. సినిమాలో విలనిజంను కొత్తగా ప్రాజెక్ట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అయితే.. యూత్ ఆడియన్స్ & కాలేజ్ స్టూడెంట్స్ ను ఒకసారి చూసేందుకు ప్రయత్నించవచ్చు!
ఫోకస్ పాయింట్: థ్యాంక్స్ కిరణ్!
రేటింగ్: 2.5/5