రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా తెరకెక్కిన ‘తిరగబడరసామి’ (Thiragabadara Saami)చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది. అయినప్పటికీ నామమాత్రంగా ఈరోజు థాంక్స్ మీట్ పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (A. S. Ravi Kumar Chowdary) మాట్లాడి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ” మంచి సినిమాని ఎవ్వడూ అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేదు. మనం ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాం.
ఒక సినిమా బ్రతికితే ఎంతో మంది రివ్యూలు రాసేవాళ్ళు తమ పిల్లలకు బట్టలు కొనగలరు, పెళ్ళానికి అన్నం పెట్టగలరు.కానీ ఒక సినిమా గురించి బ్యాడ్ గా రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. 33 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు పెద్ద పుడింగులు అనుకోవద్దు. సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర సజిషన్స్ తీసుకోండి. ఒక సినిమా బ్రతికితే మనం బ్రతుకుతాం.
స్పైసీ న్యూస్ రాస్తున్నాం లేదా రివ్యూలు రాస్తున్నాం అని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనకి మనం ఉరేసుకున్నట్టు లెక్క” అంటూ ఘాటుగా కామెంట్లు చేశాడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి. అంతేకాదు ‘ ‘తిరగబడరసామి’ సినిమాకి ఈరోజు 28 థియేటర్లు పెరిగాయని’ కూడా రవికుమార్ చౌదరి చెప్పడం గమనార్హం. అయితే ట్రేడ్ సర్కిల్స్ టాక్ ప్రకారం.. 2 వ రోజు ‘తిరగబడరసామి’ షోలు చాలా క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది.