ఇంటర్వ్యూ : ‘సీతా రామం’ కథ మొత్తం చెప్పేసిన దర్శకుడు హను రాఘవపూడి..!

  • July 25, 2022 / 05:16 PM IST

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై అశ్వినీదత్, స్వప్నా దత్ నిర్మిస్తున్న చిత్రమిది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా రష్మిక మందన, సుమంత్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

ప్ర. మీరు దర్శకుడి గా మారి 10ఏళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రయాణం ఎలా అనిపించింది ?

హను రాఘవపూడి : మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ చేసినప్పుడు ఇప్పుడున్నన్ని ఫెసిలిటీస్ లేవు. ఐతే నిర్మాత సాయి గారు ఇచ్చిన స్వేచ్ఛ వలన చాలా సౌకర్యంగా పని చేశాను. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. అటు తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానా గారితో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వల్ల గ్యాప్ ఏర్పడింది.

ప్ర. ఈ 10 ఏళ్లలో చేసిన 4 సినిమాలు.. వాటి ఫలితాలను ఎలా తీసుకుంటారు?

హను రాఘవపూడి : నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు పడలేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందిన సందర్భాలు కూడా లేవు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. క్రాఫ్ట్ తెలిసుంటే ఏ పరిశ్రమలోనైనా పని ఉంటుంది అని నమ్ముతాను.

ప్ర. హిట్టు.. ప్లాప్ అనే పాదాలకు సంబంధం లేకుండా మీ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది? దాన్ని మీరు ఎలా భావిస్తారు?

హను రాఘవపూడి : అంచనాలు క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక మనిషికి ఒకసారి గౌరవించామంటే… ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. తప్పు చేస్తే తప్ప అది బ్రేక్ అవ్వదు. ఒక సినిమా బాలేదని అనుకుంటే ఆ సినిమా వరకే అనుకుంటారు కానీ తర్వాత వచ్చిన సినిమాకు అది వర్తించదు. బహుశా అదే కారణం అని నేను అనుకుంటాను.

ప్ర. ‘సీతా రామం’ ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ఉంటుందా?

హను రాఘవపూడి : ఖచ్చితంగా అధిగమిస్తుంది. ‘సీతా రామం’ చాలా ప్రత్యేకమైన సినిమా. దీన్ని చూడటానికి మొదట కావలసింది క్యూరియాసిటీ. ‘సీతా రామం’ థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్మెంట్ , క్యూరియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత ‘సీతా రామం’ అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు.

ప్ర. ‘సీతా రామం’ కథ ఎలా పుట్టింది? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి?

హను రాఘవపూడి : నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి… ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనని కథగా రాశా. ‘సీతా రామం’ పూర్తిగా ఫిక్షనల్ మూవీ.

ప్ర. తెలుగులో ఇంత మంది హీరోలు ఉండగా దుల్కర్ సల్మాన్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? మార్కెట్ కోసమేనా?

హను రాఘవపూడి : కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్న వాళ్ళంతా ఆ సమయంలో బిజీగా ఉన్నారు. నేను, స్వప్న గారు కలిసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. ‘సీతా రామం’ లార్జర్ దేన్ లైఫ్ స్టొరీ.

ప్ర. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని ఎంపిక చేసుకోవడానికి కారణం ?

హను రాఘవపూడి : విశాల్ నాకు మంచి స్నేహితుడు. అతనితో పని చేయడం నాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది, ప్రతి విషయంలో స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ‘సీతా రామం’ పాటలకు వృద్ధాప్యం రానేరాదు.

ప్ర. 10 ఏళ్ళ సినీ ప్రయాణంలో దర్శకుడిగా మీరు నేర్చుకున్నదేంటి?

హను రాఘవపూడి : 10 ఏళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే.

ప్ర. ‘సీతా రామం’ 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ?

హను రాఘవపూడి : ఇందులో రెండు టైం పీరియడ్స్ ఉంటాయి. 1964లో కథ టేకాఫ్ పీరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ ఉంటుంది.

ప్ర. రష్మిక మందన పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుంది ?

హను రాఘవపూడి : రష్మిక పాత్ర చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒక రకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఏదో ఒక మలుపు తిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్ని కూడా ముఖ్యమైన పాత్రలే.

ప్ర. ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అంటే ఏమిటి ?

హను రాఘవపూడి : బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ’ ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవ్వరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణ సంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది.

ప్ర. టీజర్ చూశాక అందరిలో ఒక డౌట్.. సీతా పేరుతో వచ్చిన లెటర్ అడ్రస్ మారి వస్తుందా అని?

హను రాఘవపూడి : టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియో లో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి ఉత్తరాలు రాస్తారు. అలా వచ్చిన ఒక సర్ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ లో ఏముంది అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో అదే ‘సీతా రామం’ కథ.

ప్ర. ‘వైజయంతి మూవీస్’ వంటి పెద్ద బ్యానర్ లో పని చేయడం ఎలా అనిపించింది ?

హను రాఘవపూడి : వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. కాగితం మీద ఉన్నది.. స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే ఉంటే సరిపోదు. దీన్ని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం ఉన్న నిర్మాతలు.కథ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. కథ బాగుండాలి. కథ బాగుంటే అన్నీ జరిగిపోతాయి. సినిమా అనేది నచ్చితేనే చేస్తారు. అందులో ‘వైజయంతి మూవీస్’ మరింత క్లారిటీ గా ఉంటుంది.

ప్ర. మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ?

హను రాఘవపూడి : లేదు… మన జీవితంలో ఏది ఉండదో.. అదే ఊహించుకుంటాం.. దాని గురించే పరితపిస్తూ ఉంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ)

ప్ర. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?

హను రాఘవపూడి : బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ వుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus