ఏదైనా సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసినప్పుడు కచ్చితంగా అందులో అన్ని వివరాలు ఉన్నాయా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోలింగ్ బారినపడాల్సి వస్తుంది. ఈ మాట మేం చెప్పేది కాదు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా హడావుడి పెరిగాక ఇదే పరిస్థితి వస్తోంది. అక్షర దోషం, ఫొటో కలరింగ్ ఇలా అన్నీ చూస్తున్నారు మరి. ఇలాంటి సమయంలో పోస్టర్ మీద డైరెక్టర్ పేరు మిస్ అయితే.. చాలా పెద్ద విషయం అవుతుంది.
ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu) సినిమా టీమ్‌కి. మే 2న సినిమా నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ ఒకటి ఉందని టీమ్ ఇటీవల ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. అందులో వివరాలేవీ లేకపోయినా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఓ టీజర్ వస్తుందని, అందులోని డైలాగ్ ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా ఉండబోతోంది అని అంటున్నారు. ఈ వివరాలు లేకపోతే లేదు.. కానీ ఏకంగా దర్శకుడి పేరే పోస్టర్ మీద వేయలేదు. పై నుండి కిందవరకు ఎక్కడా ‘క్రిష్’ (Krish Jagarlamudi) అనే పేరే లేదు.
కొన్నాళ్ల క్రితం కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్’ (Devil) సినిమాకు ఇలాంటిదే చూశాం. దర్శకుడిగా నవీన్ మేడారం (Naveen Medaram) చేసినా రిలీజ్ నాటికి పోస్టర్ మీద పేరు లేదు. దర్శకత్వ పర్యవేక్షణ అంటూ నిర్మాత తన పేరు వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ విషయంలో అలాంటి ట్విస్ట్ చూస్తామా అనే ప్రశ్న వస్తోంది. అయితే అదేం లేదని, పోస్టర్ మీద కావాలనే వేయలేదు అని సన్నిహితులు చెబుతున్నారు. ట్వీట్‌లో క్రిష్ ట్విటర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారని గుర్తు చేస్తున్నారు.
సినిమా సంగతి చూస్తే… పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా కొన్ని ఏళ్లుగా నడుస్తూనే ఉంది. వివిధ కారణాల వల్ల సినిమా ముందుకెళ్లడం లేదు. ఇప్పుడు ఎన్నికల వేడి అయిపోయాక పవన్ ఫ్రీ అయితే వరుస షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నారట.