‘ఆ ఒక్కటి అడక్కు’ (Aa Okkati Adakku) సినిమా ట్రైలర్ చూశారా? సినిమా అంతా నరేశ్ పెళ్లి చుట్టూ తిరుగుతోంది అని అర్థమవుతోంది. మధ్యలో కాస్త యాక్షన్ టచ్ కూడా ఇచ్చారు అనుకోండి. అయితే పెళ్లి కానివాళ్లను పెళ్లెప్పుడు అని అడగొద్దు అనేదే కీలకమైన పాయింట్. అండ్ ఈ పాయింట్ మీదే నరేశ్ (Allari Naresh) కోర్టు వరకు వెళ్లినట్లు అర్థమవుతోంది. ఇప్పటి తరానికి బాగా కనెక్ట్ అయిన ఈ పాయింట్ ఎక్కడ పుట్టింది? దర్శకుడిని ఈ మాట అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం అని దర్శకుడు మల్లి అంకం అంటున్నారు. పెళ్లెప్పుడు అని తేలిగ్గా అడిగేస్తుంటారు కానీ.. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవాళ్లకీ, వాళ్ల కుటుంబ సభ్యులకు ఆ మాట చాలా బాధపెడుతుంది అని అంటున్నారాయన. పెళ్లి అనే అంశం వెనక భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం అని చెప్పారాయన.
ఇక సమాజంలో జరిగే సంఘటనలే ఈ కథకి స్ఫూర్తి అని చెప్పిన దర్శకుడు. వాటికి కొన్ని కల్పితాల్ని జోడించి కథ రాసుకున్నాను అని ‘గమనిక’ కూడా చెప్పారు. ఓసారి వాళ్ల వాళ్ల స్టూడెంట్ రీయూనియన్‌లో స్నేహితులంతా కలిశరట. కొంతమంది కుటుంబాలతో వస్తే, కొంతమందికి పెళ్లి కాలేదట. కార్యక్రమంలో భాగంగా అందరూ వేదిక మీదకొస్తే.. పెళ్లి కాని ఒకరిద్దరు రావడానికీ ఇష్టపడలేదట. పెళ్లి కాలేదనే విషయం తెలుస్తుందని వాళ్లు రాలేదని మల్లికి అర్థమైందట.
ఆ సందర్భంలో వాళ్ల ఆవేదన ఎలాంటిదో అర్థంమైందట ఆయనకు. అలాగే పెళ్లి మ్యాట్రిమోనీ ఏజెన్సీలు, పెళ్లికి సంబంధించి పత్రికల్లో వచ్చిన సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశారట దర్శకుడు మల్లి అంకం. ఇది నరేశ్ చాలా ఏళ్ల తర్వాత చేసిన కామెడీ సినిమా కావడంతో ఫలితం మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ నెల 3న ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని నరేశ్ థియేటర్లకు వస్తాడు.