మలయాళ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది అంటే ఠక్కున గుర్తొచ్చే ఊరు అరకు. దానికి దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా? చాలా ఉంది. మలయాళ సినిమా అంటే అక్కడి అందమైన లొకేషన్స్, తోటలు, పెద్ద పెద్ద పొలాలు, కొండలు, గుట్టలు ఆ అందమే వేరు. అసలు నిజం చెప్పాలంటే మలయాళ సినిమాల్ని లొకేషన్స్ కోసమే చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాలు మన దగ్గరకు వచ్చి, అలానే తీయాలంటే అరకు లాంటి ప్రాంతమే కరెక్ట్ అంటుంటారు. గతంలో చాలా మలయాళన రీమేక్‌లు అక్కడే తీశారు కూడా. ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ కూడా అక్కడే చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం మాత్రం నిరాశపరిచేదే.
పవన్ కల్యాణ్ – రానా కాంబినేషన్‌లో ఇటీవల ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ మొదలైంది. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం అని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. తమిళనాడులో పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అక్కడ అవసరమైన లొకేషన్లు ఉండొచ్చు. కానీ అరకుకు మించినవి ఉంటాయా అంటే ఏమో మరి. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చూసి భలే ఉన్నాయి లొకేషన్లు అన్నారు జనాలు. ఆ లెక్కన అరకు ఈ సినిమా భలే ఉంటుంది అనుకోవచ్చు. మరి సాగర్ కె.చంద్ర, నిర్మాతలు ఏమనుకున్నారో తమిళనాడు తీసుకెళ్లిపోతున్నారు. అంతకంటే ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
ఇక సినిమా రీమేక్ విషయానికొస్తే… మలయాళ మాతృకకు ఇక్కడ చాలా మార్పులు చేస్తున్నారట. నేటివిటీతోపాటు, ఇక్కడి హీరోల ఇమేజ్‌లకు తగ్గట్టుగా చాలా మార్పులు, చేర్పులు చేశారట. తమన్ కూడా తన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధం చేస్తున్నాడట. ఇవన్నీ ఓకే మరి పవన్ – రానా హోరాహోరీ పోరు ఎలా ఉండబోతుందనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఈలోగా కొన్ని లీక్‌లు ఎలానూ వస్తాయనుకోండి.