ఒక వ్యక్తి పేరుతో మరో వ్యక్తిని పిలవడం, మాట్లాడటం.. అసలు విషయం తెలుసుకున్నాక నాలుక కరుచుకోవడం మీరు కూడా చేసే ఉంటారు. లేదంటే కనీసం చూసే ఉంటారు. అయితే ఏకంగా భోజనానికి పిలిచి, అది నువ్వే కదా అని అడగడం ఎంతవరకు బాగుంటుంది చెప్పండి. అందులోనూ కన్‌ఫ్యూజన్ అయిన పేర్లలో ఎలాంటి సారూప్యత లేకపోవడం, అంతేకాదు ఇద్దరూ సెలబ్రిటీలు అవ్వడం లాంటి యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా జరిగింది ఎవరికో కాదు, ‘బేబీ’ (Baby) సినిమాతో అదిరిపయే విజయం అందుకున్న సాయి రాజేశ్‌కి (Sai Rajesh Neelam) . దీనికి సంబంధించిన విషయాన్ని ఆయన ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది కాస్త వైరల్‌గా మారింది. ఇంతకీ ఆయన ఏం రాశారో ఆయన మాటల్లోనే చూద్దాం. అయితే అక్కడక్కడా మన పాజ్‌లు ఉంటాయి అనుకోండి. ‘‘నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద, తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను. ‘నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహంలో ఏదీ ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు’ అని అన్నాడు.
ఈ చపాతీలు, రోటీలు తినీ తినీ మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. అనుకున్నట్లుగా 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. వెంటనే ఎంత గొప్ప సినిమా తీశారు సర్.. అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్‌మ్యాన్‌కి, కొరియర్ బాయ్‌కి, పరిచయం చేశాడు. అంతేకాదు సార్‌తో సెల్ఫీ దిగండి ‘బేబీ సినిమా డైరెక్టర్’ అంటూ ఓ 30 మంది ఫొటోలు కూడా ఇప్పించాడు.
అక్కడికి ఒక గంట తర్వాత ప్లేటులో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. ఓ పట్టుపట్టేద్దాం అని అనుకుంటుండగా “మా అమ్మాయికి సమంత (Samantha) అంటే చాలా ఇష్టమండి. ఒక్క ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడ తో అని అన్నాడు. అయితే ఇదంతా జరుగుతుంటే.. అక్కడున్న గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయాయి’’ అని రాసుకొచ్చారు సాయి రాజేశ్.
ఇక్కడ విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన ‘బేబీ’ తీస్తే.. ‘ఓ బేబీ’ సినిమాకు దర్శకుడు అని ఆయన స్నేహితుడి స్నేహితుడు పొరపడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అసలు విషయాన్ని చెప్పకుండా సాయి రాజేశ్ అక్కడి నుండి బయటకు వచ్చేశారు.