ఆ పోస్టర్స్ తీసేయడానికి చాలా బాధపడ్డాను : సందీప్ రెడ్డి వంగా

“మన డెమోక్రసీలో స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి, నాకు ఇష్టం లేకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉందో కూడా సరిగా చెప్పకుండా నా సినిమా పోస్టర్స్ ను బలవంతంగా తీసేలా చేశారు. నేను తీసిందేమీ బూతు సినిమా కాదు, ఆ పోస్టర్ లో ఉన్న ముద్దులో కూడా ఎమోషన్ ఉంటుందే కానీ అశ్లీలత ఎక్కడ కనపడింది?” అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు “అర్జున్ రెడ్డి” దర్శకులు సందీప్ రెడ్డి వంగా. తాను నిజాయితీగా తీసిన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం.. ముఖ్యంగా ప్రేక్షకలోకం స్వాగతించిన కొన్ని డైలాగ్స్ ను సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయకపోవడం అనేది నాకు మనస్థాపాన్ని కలుగజేసిందని చెబుతూనే సినిమాకి సంబంధించిన వివరాలు-విశేషాలు కూడా తెలియజేశారాయన. ఇంకొన్ని ప్రశ్నలకు కూడా నిజాయితీగా సమాధానాలు చెప్పాడాయన.

సినిమా బాగా బోల్డ్ గా తీసినట్లున్నారు ? టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్ చూసినప్పట్నుంచి అందరూ “సినిమా అంత బోల్డ్ గా ఉందేంటి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజానికి సినిమాలో ఎలాంటి బొల్డ్ కంటెంట్ లేదు. అది జస్ట్ ఎమోషన్ అంతే. ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయితే మీకు ఎలాంటి అసభ్యత కనిపించదు. ప్రస్తుతం జరుగుతున్న అనవసరమైన చర్చల కారణంగా సినిమాపై లేనిపోని అపోహలు వస్తున్నాయే కానీ.. సినిమా చూసిన తర్వాత ఏ ఒక్కరూ ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందని కానీ ఓవర్ రొమాన్స్ ఉందని గానీ ఒక్కరూ కూడా చెప్పరు.

ఒక ఫిలిమ్ మేకర్ గా మీకున్న అనుభవమేమిటి ? నిజానికి నేను ఫిజియోధేరపిస్ట్ ని. నాలుగేళ్ల కోర్సు.. ఆరున్నరేళ్లు చదివాను. నాగార్జునగారి “కేడీ” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత “మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు” చిత్రానికి రైటర్ గా వర్క్ చేశాను. అనంతరం నేను రెడీ చేసుకొన్న కథతో “అర్జున్ రెడ్డి”తో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చాను.

అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనట్లుంది ? అవును, “పెళ్ళిచూపులు” సినిమా సెట్స్ కు వెళ్ళడం, “అర్జున్ రెడ్డి” ఆఫీస్ ఓపెన్ చేయడం దాదాపు ఒకేరోజు జరిగాయి. అయితే.. మంచి నిర్మాతలు దొరకడంతో “పెళ్ళిచూపులు” షూటింగ్ పూర్తవ్వడం, రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోయాయ్. పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడా రాజీపడకపోవడం వల్ల సినిమా రిలీజ్ అనుకొన్నదానికంటే కాస్త లేట్ అయ్యింది.

ఆ లిప్ లాక్ సీన్ పోస్టర్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేద్దాం అనుకొన్నారా ? “లిప్ లాక్ పోస్టర్స్”తో నేను చెప్పదలుచుకొన్నది వేరు, ఆడియన్స్ అర్ధం చేసుకొన్నది వేరు. కాస్త ఆ పోస్టర్స్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో ఉన్న హీరో-హీరోయిన్లు ప్రేమతో ముద్దుపెట్టుకుంటారే తప్ప కామంతో కాదు. ఆ విషయాన్ని సెన్సార్ బోర్డ్ వారు అర్ధం చేసుకొంటే బాగుండేది.

సినిమా లెంగ్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డట్టున్నారు ? అసలు మీడియాలో సినిమా లెంగ్త్ 3.10 గంటలు అనే విషయం ఎందుకు హైలైట్ అయ్యిందో నాకు అర్ధం కాలేదు. నిజానికి.. ఫస్ట్ కాపీ వచ్చాక సినిమా లెంగ్త్ 3.40 గంటల లెంగ్త్ మూవీ వచ్చింది. నిడివి చెప్పేసరికి అందరూ షాక్ అయ్యి ఎవరూ సినిమా కొనరు అని తేల్చేసేసరికి, నెల రోజులు చాలా కష్టపడి దాన్ని 2.55 గంటలకు కుదించాను. అయినా నా దృష్టిలో ప్రేక్షకుడు ఒక్కసారి సినిమాకు కనెక్ట్ అయితే.. లెంగ్త్ గురించి అస్సలు పట్టించుకోడు. ఇదివరకూ మన తెలుగు సినిమాలు మూడున్నర గంటలు ఉండేవి. అప్పుడు లేని నిడివి సమస్య ఇప్పుడెందుకు హైలైట్ అవుతుందో నాకు అర్ధం కావట్లేదు.

హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? సినిమాలో హీరోది ఒక మెడికల్ స్టూడెంట్ రోల్. చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ప్రతి విషయానికి చాలా కోపంతో రియాక్ట్ అవుతుంటాడు. అతడి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు అతడి జీవన విధానాన్ని ఎలా మార్చాయి. అందులో అతడి ప్రియురాలు పోషించిన పాత్ర ఎటువంటిది అనేది సినిమా బేసిక్ థీమ్. అర్జున్ రెడ్డి పాత్రకు తన యాటిట్యూడ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రాణం పోసాడు.

బూతుల ఘాటు కాస్త ఎక్కువైనట్లుంది ? “మాదర్ **” అనేది బూతు మాటే కాదనను. కానీ.. అక్కడ హీరో ఎమోషన్ కి అది సింక్ అయ్యింది. నిజానికి అక్కడ వేరే వర్డ్ పెట్టాం. కానీ.. విజయ్ దేవరకొండ ఎమోషన్ ఎలివేట్ అవ్వాలంటే ఇంకాస్త బలమైన పదం ఉండాలని విజయ్ దేవరకొండ సూచించాడు. దాంతో.. అప్పటికప్పుడు ఆ “మాదర్ **” అనే పదాన్ని యాడ్ చేశామే తప్ప, ఏదో బూతు ఉంటే ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతారని కాదు.

అర్జున్ రెడ్డికి పై ఈస్థాయి హైప్ పెరుగుతుందని ఊహించారా ? సినిమా హిట్ అవుతుందని ఊహించానే కానీ.. టీజర్-ట్రైలర్ వల్ల ఈస్థాయి హైప్ క్రియేట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం ఈ హైప్ చూస్తుంటే ఒకింత భయం ఉన్నా.. మరోపక్క సంతోషంగానూ ఉంది. అయితే.. ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది రేపు రాత్రికి తెలుస్తుంది.

మరి నెక్స్ట్ సినిమా సంగతేంటి ? పెద్ద ఆఫర్లే వస్తున్నాయి. కానీ.. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెబితే అందరూ పబ్లిసిటీ కోసం ఇలా చెబుతున్నానని అనుకొంటారందరూ. అయితే.. పెద్ద హీరోల నుండే ఆఫర్లు వస్తున్నాయి. అయితే.. నాకు మంచి స్నేహితుడైన శర్వానంద్ కోసం ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రెడీ చేశాను. అదెప్పుడు సెట్స్ కు వెళ్తుందో సరిగ్గా చెప్పలేను కానీ.. శర్వాతో ఒక సినిమా చేయడం మాత్రం ఖాయం.

Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus