కొన్నేళ్లక్రితం టాలీవుడ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ అది క్యాన్సిల్ అయింది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నప్పటికీ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా ఆగిపోయిన ప్రాజెక్ట్ గురించి తాజాగా స్పందించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ స్వయంగా తనను పిలిపించారని.. రెండు, మూడు సిట్టింగ్స్ అయ్యాయని.. దాదాపు ఏడాది పాటు ట్రావెల్ చేశామని చెప్పారు. ‘తేరి’ సినిమాకి రీమేక్ తెరకెక్కించాలనుకున్న విషయాన్ని చెప్పారు.
బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని.. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాతో బిజీ అయ్యారని.. ఆ వెంటనే పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారని చెప్పారు. ఆ కారణంగానే తన సినిమా ఆగిపోయిందే తప్ప.. స్క్రిప్ట్ లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. పవన్ తో సినిమా ఆగిపోవడంతో.. అదే కథతో రవితేజతో సినిమా చేయాలనుకున్నామని కానీ కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని బయటపెట్టారు.
బాలయ్య కోసం పవర్ ఫుల్ కథ అనుకున్నానని.. దాని కోసం ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన విషయాన్ని వెల్లడించారు. కథ మీద వర్క్ చేస్తున్నట్లు.. బాలయ్యకి ఇంకా కథ వినిపించలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.