త్రివిక్రమ్ స్టైల్ లో చెప్పాలంటే… ఇళయరాజా మ్యూజిక్ గురించి వర్ణించడానికి మనకున్న బాషా సరిపోదు, అనుభవం సరిపోదు..! 80, 90 ప్రేక్షకులకే కాదు ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకి కూడా ఇళయరాజా సంగీతమంటే చాలా ఇష్టం అనడంలో సందేహం లేదు. కాఫీ తాగుతున్న సమయం నుండీ.. ఒక అమ్మాయి అందాన్ని వర్ణించాలన్నా.. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. అలాగే నిద్రపోయే ముందు వరకూ.. మనకి ముందుగా గుర్తొచ్చేది ఇళయరాజా పాటే అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఇళయ రాజాని … ఇప్పటి వరకూ ఒక స్టార్ డైరెక్టర్ ఉపయోగించుకోలేదు. ఇంతకీ ఎవరా స్టార్ డైరెక్టర్ అనేగా మీ డౌట్… ఇంకెవరు మన శంకర్.
దాదాపు శంకర్ ప్రతీ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో వచ్చిన ‘అపరిచితుడు’ ‘స్నేహితుడు’ చిత్రాలకి మాత్రం.. రెహమాన్ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో హారిస్ జయరాజ్ తో పనిచేసాడు. అసలు శంకర్… ఇళయరాజా లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఎందుకు పనిచేయలేదు… అని శంకర్ నే అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు. శంకర్ ఈ ప్రశ్నకి బదులిస్తూ.. “నేను దర్శకత్వం మొదలు పెట్టిన తొలినాళ్లలో ఇళయరాజా గారితో కలిసి పనిచేయాలనుకున్నాను. ‘జెంటిల్‌మ్యాన్’ చిత్రానికి ఆయన్నే సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలని మొదట నిర్ణయించుకున్నాను. ఆయనను కలిసి మాట్లాడేందుకు నాకు అపాయింట్‌మెంట్ కూడా లభించింది. కానీ ఆయన పట్ల నాకున్న భయం, గౌరవం వల్ల ఆయనను అది కావాలి.. ఇది కావాలి.. ఇలా చేయాలి.. అలా చేయాలని చెప్పలేను.ఇళయరాజా గారు ఒక మ్యూజిక్ డిక్షనరీ. అయనతో పనిచేయాలంటే నాకుండే నాలెడ్జ్ సరిపోదనిపించింది. అందుకే రాజా సార్ తో పనిచేయలేదు” అంటూ వివరణ ఇచ్చాడు.