సినిమా ఇండస్ట్రీలో కొన్ని బంధాలు అనుకోకుండా మొదలవుతాయి. కొన్నిసార్లు చిన్న అపార్థాలు కూడా గొప్ప స్నేహాలకు నాంది పలుకుతాయి. దర్శకుడు సుందర్ సి, హీరో విశాల్ (Vishal)..ల మధ్య ఉన్న అనుబంధం అలాంటిదే. ‘మద గజ రాజా’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సుందర్ సి (Sundar C) . విశాల్‌తో తన స్నేహం ఎలా మొదలైందో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సుందర్‌కి విశాల్..ని వ్యక్తిగతంగా కలవడానికి ముందు, విశాల్ తన భార్య ఖుష్బూకి (Khushbu) మంచి స్నేహితుడని మాత్రమే తెలుసు.
ఓ సినిమా స్క్రిప్ట్ కోసం విశాల్‌ని కలవాలని సుందర్, అతని అసిస్టెంట్ రైటర్ ప్లాన్ చేశారు. మీటింగ్ సమయం కూడా ఖరారైంది. కానీ, మీటింగ్ రోజున ఊహించని సంఘటన జరిగింది. సమయానికి కొద్ది నిమిషాల ముందు, విశాల్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లడం సుందర్ అసిస్టెంట్ చూశాడు. సుందర్ సి. ఆఫీసుకు వెళ్లేసరికి, విశాల్ లేడని తెలుసుకుని కోపంతో ఊగిపోయారు. తనని అవమానించారని భావించారు. ఇంటికి వెళ్లాక జరిగిన విషయం భార్య ఖుష్బూకి చెప్పారు.
ఖుష్బూ విశాల్‌తో మాట్లాడతానని చెప్పినా సుందర్ వినిపించుకోలేదు.రెండు నెలల తర్వాత, ఓ అవార్డు ఫంక్షన్‌లో సుందర్, విశాల్ ఎదురుపడ్డారు. సుందర్ సి. కోపంగా ఉండటంతో విశాల్ వైపు చూడలేదు. ఎందుకంటే అతనితో కలవద్దు, మాట్లాడొద్దు అని అనుకున్నారు. కానీ, విశాల్ స్వయంగా సుందర్ దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పాడు. తన కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఉండటం వల్ల మీటింగ్‌కు రాలేకపోయానని వివరించాడు.
విశాల్ నిజాయితీని చూసి సుందర్ ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనతో వారి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత విశాల్ మంచి వ్యక్తి అని సుందర్ గ్రహించారు. కార్తీక్‌ను తన సోదరుడిగా భావించే సుందర్ ఇప్పుడు విశాల్‌ని కూడా తమ్ముడిలాగే చూసుకుంటానని చెప్పారు. ఇలా ఒక చిన్న అపార్థం ఇద్దరి మధ్య బలమైన బంధానికి పునాది వేసింది.