పదుల సంఖ్యలో తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాలకు ప్రత్యేక గౌరవంతో పాటు గుర్తింపును తెచ్చిన దర్శకుడు విశ్వనాథ్. సినిమా ఇండస్ట్రీలోకి సౌండ్ రికార్డిస్ట్ గా అడుగుపెట్టిన విశ్వనాథ్ కెరీర్ మొదట్లో కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆత్మగౌరవం అనే సినిమాతో దర్శకునిగా మారారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో హీరోగా నటించారు. శంకరా భరణం సినిమా విశ్వనాథ్ కు దర్శకునిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.
కె విశ్వనాథ్ భారతీయ కళల నేపథ్యంలో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. సాగర సంగమం, స్వర్ణకమలం, సిరివెన్నెల, స్వాతికిరణం లాంటి సినిమాలు దర్శకునిగా కె విశ్వనాథ్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ విశ్వనాథ్ తెరకెక్కించిన స్వయంకృషి, ఆపద్భాంధవుడు, స్వర్ణకమలం లాంటి సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం అందుకున్నాయి. అయితే ఆ తరువాత విశ్వనాథ్ సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వనాథ్ వయస్సు ప్రస్తుతం 91 సంవత్సరాలు.
కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమాలతో పాటు ఒక సీరియల్ కు సైతం దర్శకత్వం వహించారు. ఆ సీరియల్ లో స్వర్ణ పాత్రలో జ్యోతిరెడ్డి నటించగా మంగళ పాత్రలో భానుప్రియ నటించారు. బుల్లితెరపై ఆ సీరియల్ పెద్ద సక్సెస్ కావడం గమనార్హం. విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి విశ్వనాథ్ సినిమాల్లో కూడా నటించడం తగ్గించారు. కలిసుందాం రా, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు నటుడిగా విశ్వనాథ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.