విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన చిత్రం “దొరసాని”. 1980 నేపధ్యంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ఇవాళ విడుదలైంది. విజయ్ దేవరకొండ తమ్ముడు కావడంతో సాధారణంగానే అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. మరి జూనియర్ దేవరకొండ హీరో డెబ్యూ సక్సెస్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: సినిమా చూడడం పూర్తయ్యేసరికి నా బుర్రలో కాస్త గట్టిగా ముద్రపడిపోయిన ప్రశ్న ఏమిటంటే.. ఆల్రెడీ ఇదే తరహా కథనంతో మరాఠీలో “సైరత్”, ఆ చిత్రానికి రీమేక్ గా హిందీలో “ధడక్” అనే చిత్రాలు వచ్చి ఆల్రెడీ ఏళ్ళు గడిచిపోతుంది కదా.. మరి దర్శకుడు కె.వి.ఆర్.మహేంద్ర 40కి పైగా వెర్షన్లు ఎందుకు రాశాడబ్బా? అని. పోనీ మూల కథను పక్కనపెడితే.. కనీసం కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.
రాజు (ఆనంద్ దేవరకొండ) అనే తక్కువ జాతికి చెందిన యువకుడు.. గఢీల పరిపాలనలో దొరగారి కుమార్తె దేవకి (శివాత్మిక)ను ఇష్టపడతాడు. అనంతరం ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. కానీ.. ఎప్పట్లానే కులం వీరి ప్రేమకు అడ్డుగా నిలవగా.. రాజుకు నక్సలైట్ల విప్లవ ఉద్యమం అండగా నిలుస్తుంది.
ఈ ప్రేమోద్యమ పోరాటంలో చివరికి ఎవరు గెలిచారు? ప్రేమ గెలిచిందా? లేకా పంతంతో కూడిన కుల పిచ్చి గెలిచిందా? అనేది వెండితెరపై చూడాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: ఆనంద్ దేవరకొండ నటన పరంగా ఇంకా ఓనమాలు దిద్దాల్సి ఉంది. కానీ.. రాజు అనే పాత్రలో చాలా సహజంగా కనిపించాడు. కాస్త హావభావాల విషయంలో జాగ్రత్త వహించి ఉంటే ఇంకాస్త బాగుండేది. సేమ్ టు సేమ్ విజయ్ దేవరకొండ వాయిస్ లా ఉండడం, లుక్స్ వైజ్ కూడా విజయ్ కనిపించడం చిన్న ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే.. స్క్రీన్ ప్రెజన్స్ విషయంలో జాగ్రత్తపడాల్సింది.
శివాత్మిక హీరోయిన్ అనేకంటే మంచి ఆర్టిస్ట్ అని చెప్పాలి. పోలీస్ స్టేషన్ సీన్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె చూపిన పరిణితి ఆశ్చర్యపరుస్తుంది.
దొర పాత్రలో వినయ్ వర్మ గాంభీరంగా ఉన్నాడు. కిషోర్ నటనలో ఇంటెన్సిటీ ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ సరిగా లేకపోవడంతో ఆ క్యారెక్టర్ కి కథలో కానీ కథనంలో కానీ సరైన ప్రాముఖ్యత లభించలేదు. “ఫిదా” ఫేమ్ శరణ్య సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకొంది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రశాంత్ ఆర్.విహారీ సంగీతం ఎంత బాగుందంటే.. సాధారణంగా సినిమా మధ్యలో ఎప్పుడైనా పాటలొస్తే కాస్త చిరాకు పడతాం.. కానీ “దొరసాని” విషయంలో మాత్రం విభిన్నంగా పాట అయిపోతుందంటే బాధపడతాం. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. సదరు పాటలను తెరకెక్కించిన విధానం కూడా హృద్యంగా ఉంది. ఈ సినిమాకి టైటిల్ పాత్ర పోషించిన శివాత్మిక తర్వాత ఎవరైనా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉన్నారు అంటే అది ప్రశాంత్ విహారి.
సన్నీ కూరపాటి కెమెరా వర్క్, మధుర శ్రీధర్ రెడ్డి ప్రొడక్షన్ వేల్యుస్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ పనితనాన్ని మాత్రం మెచ్చుకోవాలి. అలాగే కాస్ట్యూమ్స్ కూడా. 1987 నాటి సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించారు.
ఇక దర్శకుడు మహేంద్ర కథగా రాసుకొన్నప్పుడు అందులో ఏం ఫీల్ కలిగిందో తెలియదు కానీ.. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం చాలా పాత సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కథనం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. గఢీల పరిపాలన, కుల ఘర్షణలు, అంటరానితనం, నక్సలిజం లాంటి చాలా సెన్సిబుల్ విషయాలను కథలో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని సరిగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సినిమా కథనం చాలా వరకూ “సైరత్”ను గుర్తుకు చేయడం పెద్ద మైనస్.
విశ్లేషణ: ఒక ప్రేమ కథ జనాలని ఆకట్టుకోవాలంటే హృద్యమైన కథ ఉండాలి, హృదయాన్ని ధ్రవింపజేసే కథనం ఉండాలి, అన్నిటికీ మించి మర్చిపోలేని ముగింపు ఉండాలి. “దొరసాని” సినిమాలో పైన పేర్కొన్న విషయాల్లో ఏ ఒక్కటీ కనిపించదు. దాంతో జూనియర్ దేవరకొండ డెబ్యూ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.