కంటెంట్ ఎలాంటిది అనే విషయం పక్కన పెడితే టీజర్ & ట్రైలర్ తో ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకున్న చిత్రం “డ్రింకర్ సాయి” (Drinker Sai) . కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ తెరక్కించిన ఈ చిత్రం ద్వారా ధర్మ, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇంత హడావుడి చేసిన ఈ చిన్న సినిమా కంటెంట్ తో ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!
Drinker Sai Review
కథ: తల్లిదండ్రులు కట్టించిన హాస్పిటల్ నుంచి వచ్చే డబ్బులతో జల్సా చేస్తూ, ముఖ్యంగా రోజంతా మందు తాగుతూ ఓ ముగ్గురు స్నేహితులని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు సాయి (ధర్మ). తనకు యాక్సిడెంట్ చేసిన భాగి (ఐశ్వర్య శర్మ)ను ఇష్టపడి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. భాగీకి తాగుబోతు సాయి అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ..
ఎక్కడ వయొలెంట్ గా రియాక్ట్ అవుతాడో అనే భయంతో, వాడి ప్రేమను భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? భాగీ తనను ప్రేమించేలా సాయి మార్చుకోగలిగాడా? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: తెలుగు ఇండస్ట్రీకి ధర్మ పేరుతో మరో మంచి టాలెంట్ దొరికింది అనే చెప్పాలి. కుర్రాడిలో మంచి ఈజ్ ఉంది. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బందిపడడం లేదు. ముఖ్యంగా భారీ ఎమోషన్స్ కూడా ఈజీగా పండించాడు. సరైన కథలు ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉంది. హీరోయిన్ ఐశ్వర్య శర్మ కూడా చురుకైన హావభావాలతో అలరించింది. ఒక కమర్షియల్ హీరోయిన్ కి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది.
కిర్రాక్ సీత, రీతు చౌదరిల పాత్ర ద్వారా పండించిన కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. భద్రంతో చేయించిన మంతెన సత్యనారాయణ స్పూఫ్ ఒకట్రెండు సీన్స్ వరకు ఒకే కానీ.. దాన్ని సాగదీసిన విధానం మాత్రం ఏమాత్రం అలరించలేకపోయింది.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీ వసంత్ బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఆ పాటల ప్లేస్మెంట్ సరిగా కుదరకపోయినా వినడానికి మాత్రం ఇబ్బందిలేకుండా చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది, కొన్ని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ.. మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. బ్రైట్ నెస్ కాస్త ఎక్కువైంది, డి.ఐ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రాసుకున్న కథలోనే దమ్ము లేదు అంటే.. కథనంలో కనీస స్థాయి పట్టు లేదు. ఆ కారణంగా టెక్నికల్ గా సినిమా ఎంత బాగున్నప్పటికీ.. అసలైన కథ-కథనం లోపించడంతో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ సినిమా ఫెయిల్ అయితే మాత్రం కారణం కేవలం దర్శకుడే.
విశ్లేషణ: డబుల్ మీనింగ్ జోకులు, సీ గ్రేడ్ ఎలివేషన్స్ కి కాలం చెల్లింది. ఎంత నవతరం ప్రేక్షకులైనా ఈ స్థాయి డబుల్ మీనింగ్ జోక్స్ ఎంజాయ్ చేసే స్థాయిలో లేరు. ఏదైనా నీతి చెప్పేప్పుడు.. ఎమోషన్ అనేది సరిగా వర్కవుట్ అవ్వాలి. లేకపోతే “డ్రింకర్ సాయి”లా అవుతాయి సినిమాలు. ధర్మ, ఐశ్వర్య చక్కని నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా దర్శకుడి ఆలోచనాధోరణి లోపం కారణంగా ఆకట్టుకోలేకపోయిన సినిమా ఇది.
ఫోకస్ పాయింట్: 144 నిమిషాల “డోంట్ డ్రింక్ యాడ్” ఈ చిత్రం!
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus