2009లో విడుదలైన “కథ” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ మన్నె, 16 ఏళ్ల తర్వాత సినిమా మీద అమితమైన ప్యాషన్ తో తెరకెక్కించిన సినిమా “ఈషా”. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై, జనాల్లోకి వెళ్లిందంటే మాత్రం కారణం వంశీ నందిపాటి & బన్నీ వాసు. ఆ ఇద్దరు ఎడతెరుపు లేకుండా చేసిన ప్రమోషన్స్ వల్లే ఈ సినిమా గురించి ఆడియన్స్ కి తెలిసింది, ప్రీమియర్లు పడ్డాయి, కలెక్షన్స్ వస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉంది? వంశీ నందిపాటి చెప్పినట్లు నిజంగా భయపడి తాయత్తులు కట్టుకోవాలా? అనేది చూద్దాం..!!
కథ: దెయ్యాలు లేవు అని బలంగా, లాజికల్ గా, సైంటిఫికల్ గా నమ్మే నలుగురు స్నేహితులు (త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు). చుట్టుపక్కల జనాల్ని మూఢ నమ్మకం చాటున మోసం చేసే దొంగ బాబాలను, తాంత్రికుల మర్మాలను బట్టబయలు చేసి.. ప్రజల్ని జాగరూకపరుస్తుంటారు.
అయితే.. ఒక సమస్యను ఛేదిస్తూ వాళ్లే పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు.
ఏమిటా సమస్య? దాన్నుండి బయటపడగలిగారా? అనేది “ఈషా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: హారర్ సినిమాల్లో నటనకి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. చాలావరకు రియాక్షన్లతోనే నెట్టుకురావాల్సి ఉంటుంది. త్రిగుణ్ & అఖిల్ కాస్త ఎక్కువ మార్కులు సంపాదించుకోగా.. హెబ్బా, సిరి పర్వాలేదనిపించుకున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ వర్క్ అవ్వాల్సింది హెబ్బా నటన మీద, అక్కడ హెబ్బా మెప్పించలేకపోయింది.
బబ్లూ పృథ్వీరాజ్ మేకప్ బాలేదు కానీ.. నటుడిగా సినిమాకి మంచి వేల్యూ యాడ్ చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: ఆర్.ఆర్.ధృవన్ ఈ సినిమాని ఒంటిచేత్తో కాపాడాడు అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే ఎంతో వీక్ గా ఉన్నప్పటికీ.. తన బీజీయం & సౌండ్ డిజైన్ తో సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేశాడు ధృవన్.
సినిమాటోగ్రాఫర్ కి సరైన సపోర్ట్ లేదు అని మొదటి నుండే అర్థమైపోతుంది. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాని చుట్టేశారు. అందువల్ల టెక్నికల్ గా చాలా వీక్ గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ఆకాశంలో కనిపించే స్వర్గద్వారం, గబ్బిలం, సిరి హనుమంతును భయపెట్టే శవాల ఎఫెక్ట్స్, కార్ యాక్సిడెంట్ గ్రాఫిక్స్ వంటివి చాలా పేలవంగా ఉన్నాయి.
అయితే.. దర్శకుడు కానీ, సినిమాని విడుదల చేసిన వంశీ & వాసు కానీ బలంగా నమ్మింది క్లైమాక్స్ ని. దాన్ని డీల్ చేసిన విధానం అయితే బాగుంది. సృష్టిధర్మం, కర్మలు వంటివి విషయాలను వివరించిన తీరు, సైన్స్ & లాజిక్స్ కారణంగా మనం నమ్మకుండా, గుడ్డిగా తప్పు అనేస్తున్న విషయాలను చాలా స్పష్టంగా వివరించారు. అక్కడ ఎమోషన్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. అయితే.. ఆ సందర్భం తాలుకు ఎమోషన్ & డెప్త్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు అంటే కారణం మాత్రం సీన్ కంపోజిషన్ క్వాలిటీ. ఆ విషయంలో కేర్ తీసుకొని ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. అయినప్పటికీ… శ్రీనివాస్ మన్నె దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు.
విశ్లేషణ: లాజికల్ గా చూస్తే చాలా లోటుపాట్లు ఉంటాయి, గ్రాఫిక్స్ బాలేవు, పెర్ఫార్మెన్సులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ.. సినిమాని నిలబెట్టేది ఆ చివరి 15 నిమిషాలు, ఆ సందర్భంలో వచ్చే సంభాషణలు. “ఈషా” జోనర్ పరంగా హారర్ సినిమా అయినప్పటికీ.. చివర్లో చర్చించిన విషయం మాత్రం మన కర్మలను గుర్తుచేస్తుంది.
ఫోకస్ పాయింట్: మూఢనమ్మకానికి, సృష్టి ధర్మానికి మధ్య ఊగిసలాడిన “ఈషా”.
రేటింగ్: 2/5