పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో “ఖుషీ” తర్వాత ఆస్తాయి క్రేజ్ సంపాదించుకున్న సినిమా “ఓజీ” (OG) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతవారం సినిమా రిలీజయ్యింది, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, అమెరికాలో ఏకంగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. కానీ.. సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసినవాళ్లు మాత్రం ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు.
బుధవారం రాత్రి ప్రీమియర్స్, గురు, శుక్రవారం కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ.. శనివారం, ఆదివారం బాగా పడిపోయాయి. ఒక కొత్త సినిమాకి, అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి వారాంతపు కలెక్షన్స్ సరిగా లేకపోవడం, చాలా థియేటర్లు సగం కూడా నిండకపోవడం అనేది బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇంత పెద్ద హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఎందుకని తెలుగు రాష్ట్రాల్లో బ్రేకీవెన్ కోసం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదురుచూడాల్సి వస్తుంది? ఈ దయనీయ పరిస్థితికి దారి తీసిన విషయం ఏంటి? అంటే మూకుమ్మడిగా అందరూ చెబుతున్న సమాధానం టికెట్ రేట్లు.
అసలే A సర్టిఫికెట్ సినిమా, ఆపై సామాన్యులకు అందని స్థాయి టికెట్ రేట్లు సినిమాని ప్రేక్షకులకు దూరం చేశాయి. సింగిల్ స్క్రీన్ లలో కూడా 200, 300 టికెట్ రేట్లు అనేది సినిమాని బాగా దెబ్బ తీశాయి. కనీసం సోమవారానికైనా రేట్లు తగ్గితే బెటర్ అనుకుంటే.. అదీ చేయడం లేదు. దసరా పండగ వరకు ఇవే రేట్లు కంటిన్యూ చేస్తున్నారు. ఆ కారణంగా సినిమా చూద్దామనే ఆసక్తి ఉన్నప్పటికీ.. రేట్లకు భయపడి జనాలు ఓజీ (OG) థియేటర్ల వైపు రావడం లేదు. అసలే ఈవారం “కాంతార చాప్టర్ 1” కూడా ఉంది.
దాన్ని తట్టుకొని నిలబడి బ్రేకీవెన్ సాధించడం అనేది “ఓజీ” (OG) చిత్రానికి కేవలం టికెట్ రేట్ల వల్లే సాధ్యపడడం లేదు అని చెప్పుకోవడం కూడా అవమానమే. మరి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎందుకని ఈ పనికిమాలిన పంతాన్ని ప్రదర్శిస్తూ.. ప్రతి సినిమాకి టికెట్ హైక్ పర్మిషన్లు తెచ్చుకుని తెలుగు సినిమాను ఎందుకని తుంగలో తొక్కుతున్నారో అర్థం కావడం లేదు. “ఓజీ” క్లోజింగ్ కలెక్షన్స్ అయినా వాళ్లకి కనువిప్పు కలిగిస్తే బాగుండు.