రామ్ చరణ్ 2026 రిలీజ్ ‘పెద్ది’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ బజ్‌ను కాపాడటానికి మేకర్స్ “చికిరి చికిరి” అనే ఫస్ట్ సాంగ్‌ను వదిలారు. కానీ, ఈ పాట ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఉన్న ఈ పాటలో, జాన్వీని చూపించిన విధానంపై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ రియాక్షన్ వస్తున్నాయి. షార్ట్ బ్లౌజులు, స్కర్టులతో, కేవలం గ్లామర్ డోస్ ఎక్కువైన డ్యాన్స్ మూవ్స్‌తో జాన్వీని ప్రెజెంట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. పాటలో డెప్త్ కంటే, గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
Janhvi Kapoor
ఈ పాట మ్యూజిక్, కొరియోగ్రఫీ కంటే, జాన్వీ విజువల్స్ వల్లే వైరల్ అయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇది స్టోరీకి అవసరమైనా కాకపోయినా, కేవలం యూత్ ని ఎట్రాక్ట్ చేయడం కోసమే ఆమెను ఇలా చూపిస్తున్నారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ‘దేవర: పార్ట్ 1’ సమయంలోనూ ఆమె పాత్రపై ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ‘పెద్ది’ సాంగ్ చూశాక, టాలీవుడ్‌లో ఆమెకు కేవలం గ్లామర్ పాత్రలే దక్కుతున్నాయన్న ఆందోళన సోషల్ మీడియాలో గట్టిగా వ్యక్తమవుతోంది. ఇది ఆమె కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదన్నది వారి వాదన.
ఇక్కడే నెటిజన్లు ఒక ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెస్తున్నారు. బాలీవుడ్‌లో మృణాల్ కూడా ఇలాగే టైప్‌కాస్ట్ అవుతున్న సమయంలో, తెలుగు ఇండస్ట్రీ ఆమెకు ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ లాంటి అద్భుతమైన పాత్రలిచ్చింది. ఆమెలోని నటిని, ఎమోషనల్ డెప్త్‌ను బయటకు తీసి, ఆమె కెరీర్‌నే మార్చేసింది.
కేవలం గ్లామర్ డాల్‌గా కాకుండా, ఒక బలమైన నటిగా ఆమెను నిలబెట్టింది మన టాలీవుడే. ఈ విషయంలో మన డైరెక్టర్లను అందరూ అభినందించారు. మృణాల్ విషయంలో అంత గొప్పగా ప్రవర్తించిన తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు జాన్వీ కపూర్ విషయంలో ఎందుకు రివర్స్‌లో వెళ్తోంది? అనేది అసలు ప్రశ్న. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా, ఆమెపై భారీ అంచనాలున్నాయి.
కానీ, టాలీవుడ్ ఆమెను కేవలం ‘అలంకారప్రాయమైన’ పాత్రలకే పరిమితం చేస్తోందని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. జాన్వీ కావాలనే ఎంచుకుంటున్న పాత్రలా, లేక ఇండస్ట్రీ ఆమెకు అలాంటి ఆఫర్లే ఇస్తోందా అని పెద్ద చర్చ మొదలైంది. కొందరు ఇది జాన్వీ ఫిల్మ్ చాయిస్‌ల తప్పే అంటుంటే, మరికొందరు ఇండస్ట్రీదే బాధ్యత అని కామెంట్ చేస్తున్నారు. అయితే, చాలా మంది ‘పెద్ది’ సినిమా విడుదలయ్యే వరకు ఆగి, పూర్తి పాత్రను చూశాకే ఒక నిర్ణయానికి రావాలని అంటున్నారు.
