సినిమాలు చూసేవాళ్ళు రెండు రకాలు.. సరదాగా నెలకో లేదా రెండు నెలలో ఒకసారి సినిమా చూసేవాళ్ళు ఒక రకమైతే.. విడుదలైన సినిమాలన్నీ ఆ వారం చూస్తేగానీ నిద్రపట్టని వాళ్ళు రెండో రకం. ఆ రెండో శాతం జనాలు ఉండేది తక్కువే అయినా సినిమాని ప్రేమించేది వాళ్ళే. ఆ సినిమా ప్రేమికులకు ఈవారం నిజమైన పండగ కానుంది. ఎందుకంటే నాలుగైదు కాదు ఏకంగా పది సినిమాలు ఈవారం విడుదలవుతున్నాయి. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన “శైలజా రెడ్డి అల్లుడు”, సమంత ప్రధాన పాత్ర పోషించిన “యు టర్న్” చిత్రాల మీదే ప్రేక్షకులకు ధ్యాస ఉన్నప్పటికీ.. ఈ రెండు సినిమాలతోపాటు “ఎందుకో ఏమో, జనతా హోటల్, కురుక్షేత్రం, మసక్కలి” అనే మరో నాలుగు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.
వాటితోపాటు.. హిందీ చిత్రం “మన్ మర్జియా, లవ్ సోనియా, మిత్రోన్”లు కూడా విడుదలవుతున్నాయి. “మిత్రోన్” చిత్రం “పెళ్లి చూపులు” రీమేక్ అవ్వడం విశేషం. రెండు విభిన్నమైన ఈ చిత్రాల మీద బాలీవుడ్ ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. అలాగే.. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఏలియన్ సిరీస్ అయిన “ప్రెడేటర్” కొత్త సినిమా కూడా ఇదేరోజు విడుదలవుతోంది. ఈ విధంగా మూడు రోజుల్లో విడుదలవుతున్న ఈ పది సినిమాలు సినిమా ప్రేమికులను ఈ వీకెండ్ మొత్తం ఫుల్ బిజీ చేసేస్తాయి. మరి ఈ సినిమాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో, ఏది ఫెయిల్ అవుతుందో చూడాలి.