ఫిదా

“ప్రేమమ్” ఫేమ్ సాయిపల్లవి – వరుణ్ తేజ్ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఫిదా”. స్వచ్చమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా నేటితరం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే.. సమీక్ష చదవాల్సిందే.

కథ : వరుణ్ (వరుణ్ తేజ్) తన అన్నయ్య పెళ్లి కోసం అమెరికా నుండి భాన్సువాడ వస్తాడు. అక్కడ పెళ్లికూతురు చెల్లి భానుమతి (సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు. భాను కూడా వరుణ్ చేష్టల్ని ఇష్టపడుతూ.. మెల్లగా అతడి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు చెప్పుకొనే సమయంలో చోటు చేసుకొన్న చిన్నపాటి మనస్పర్ధ కారణంగా ఇద్దరి నడుమ కనీసం మాటలు కూడా లేనంత దూరం ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత తన తండ్రికి దూరం అవ్వకుండా అదే ఊర్లో ఉండాలని కోరుకొనే భానుమతికి, అమెరికాలో సెటిల్ అవ్వాలనుకొన్న వరుణ్ కి ఎలా సింక్ అయ్యింది? ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయ్యారు?

నటీనటుల పనితీరు : మొదట్నుంచి ఫార్మాట్ ను నమ్ముకోకుండా రియలిస్టిక్ మూవీస్ ను ఎన్నుకుంటూ తనదైన పంధాను క్రియేట్ చేసిన వరుణ్ తేజ్, “ఫిదా”లోనూ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. నిజమైన ఎన్నారై కుర్రాడిలా ఒదిగిపోయాడు. ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా పండించాడు. వరుణ్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. మలయాళ చిత్రం “ప్రేమమ్”తో పరిచయమైన చిన్నది సాయిపల్లవి. అప్పటికే పలు టీవి షోస్ ద్వారా ప్రేక్షకలోకానికి పరిచయమైనప్పటికీ.. “ప్రేమమ్”లో పల్లవిని దర్శకుడు చూపించిన విధానానికి యువ హృదయాలు దాసోహమయ్యాయి. సాయిపల్లవి “ఫిదా” చిత్రానికి ప్రాణవాయువు లాంటిది. హావభావాలతోనే హృదయాల్ని కొల్లగొట్టేస్తున్న ఈ అమ్మడు “ఫిదా” సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పుకొని మరింత మందికి చేరువయ్యింది. హుందాతనం, చిలిపిదనం సమపాళ్లలో కలిసిన “భానుమతి” పాత్రలో అదరగొట్టింది. చాలా సన్నివేశాల్లో వరుణ్ తేజ్ ను డామినేట్ చేసేసింది సాయిపల్లవి. సత్యం రాజేష్, గాయత్రి వంటి ఆర్టిస్టులు ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ.. సాయిపల్లవి వాళ్లందర్నీ భీభత్సంగా డామినేట్ చేసేసి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

సాంకేతికవర్గం పనితీరు : సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో స్టోరీ అనేది కనిపించదు. కేవలం క్యారెక్టరైజేషన్స్ తో కానిచ్చేస్తుంటాడు. కానీ.. “ఫిదా” సినిమా కోసం శేఖర్ కమ్ముల రాసుకొన్న కథలో విషయం ఉంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను రాసిన, ఎస్టాబ్లిష్ చేసిన విధానం అమోఘం. సాధారణంగా తెలుగు సినిమాల్లో ఒక లేడీ క్యారెక్టర్ ను ఇంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడం చూసి ఉండం. అయితే.. హీరోయిన్ క్యారెక్టర్ ను ఇంత బాగా రాసిన శేఖర్ కమ్ముల.. కథలో ముఖ్యమైన పాత్ర అయిన హీరో క్యారెక్టర్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం.. హీరోహీరోయిన్ల నడుమ జరిగే గొడవకి సరైన మోటోను చూపించలేకపోయాడు. అందువల్ల ఇద్దరిమధ్య గొడవ ఎందుకు వచ్చింది? అనే విషయంలో ఆడియన్స్ కి కూడా క్లారిటీ ఉండదు. ఆ ఒక్క విషయాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే.. సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది.

అలాగే.. ఫస్టాఫ్ ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా నడిపించిన శేఖర్ కమ్ముల.. సెకండాఫ్ కి వచ్చేసరికి అయిదో గేర్ లో నడుస్తున్న ఫెరారీ కారుకు ఒక్కసారిగా సెకండ్ గేర్ లోకి తీసుకొచ్చి గతుకుల మీద తోలేసినట్లు నెమ్మదించాడు. ఇలా రెండు మూడు మైనస్ లు తప్ప.. “ఫిదా”లో చెప్పుకోడానికి పెద్దగా మైనస్ పాయింట్స్ లేవు. శక్తికాంత్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ. సన్నివేశాల్లోని చాలా ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా ఎలివేట్ అవ్వడంలో శక్తికాంత్ పనితనం కీలకపాత్ర పోషించింది. అలాగే.. జీవన్ రాజు నేపధ్య సంగీతం కూడా మనసుల్ని కట్టిపడేస్తుంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ లో జర్క్స్ ఎక్కువయ్యాయి. చాలా చోట్ల సీన్ టు సీన్ సింక్ మిస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో జర్క్స్ ఎక్కువయ్యాయి.

విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. దర్శకుడు మెదడులో సృష్టించుకొన్న సన్నివేశాన్ని అదే స్థాయిలో కెమెరాలో బంధించాడు. పెళ్లి, పెళ్లి భోజనాల సన్నివేశాలు ఎంత సహజంగా ఉన్నాయంటే.. నిజంగా మన ఇంటిపక్కన జరిగే తంతును చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇవి మాత్రమే కాక సన్నివేశమూ చాలా హుందాగా కనిపిస్తుంది. అలాగే.. సినిమా మొత్తంలో సాయిపల్లవి ఎక్కువశాతం హాఫ్ శారీతోనే కనిపిస్తుంది.. నడుమందాలూ చూపిస్తూనే ఉంటుంది, కానీ మనకి అసభ్యకరంగా ఎక్కడా కనిపించదు. సో, అందాన్ని కూడా అందంగా చూపించిన విజయ్.సి కుమార్ పనితనం ప్రశంసనీయం.

విశ్లేషణ : కృత్రిమమైన ప్రేమలు, స్వచ్ఛత కనిపించని బంధాలతో జీవితంలోనే కాక సినిమాల్లోనూ చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకుడికి ఒక మంచి సినిమా, సహజమైన సినిమా చూశామన్న భావన కలిగించే చిత్రం “ఫిదా”.

రేటింగ్ : 3/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus