తెలుగు సినిమాలు చూసే వారికి ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కారం చేడు(ప్రకాశం జిల్లా )లో చిన్న మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వీరిద్దరూ తమ ప్రతిభతో దేశంలోని అనేక భాషా చిత్రాలకు పనిచేశారు. 31 ఏళ్ళ అనుభవంలో 1100 సినిమాలకి పనిచేసి అనేక అవార్డులను అందుకున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తమ సినీ పయనాన్ని గుర్తు చేసుకున్నారు. “మేము1987లో చెన్నయ్‌కు వెళ్ళాము. అప్పటి నుంచి 2009 వరకు ఫైట్ మాస్టర్లకు అసిస్టెంట్లుగా పని చేశాము. మేము ఫైట్ మాస్టర్ రాజును గురువుగా భావిస్తాం. ఇప్పటివరకు ఇద్దరం 1100 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్లగా పనిచేశాము.
మాకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్‌సింగ్, ఖైదీనెంబర్ 150, సినిమాలు ఎక్కువ గుర్తింపును తెచ్చి పెట్టాయి” అని తెలిపారు. తెలుగులో నేటి హీరోలందరితో పనిచేసిన వీరిద్దరూ ప్రస్తుతం మహేష్ మహర్షి, చిరు సైరా సినిమాలకు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇంకా వారు మాట్లాడుతూ “మాకు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. అయన మమ్మల్ని బాగా ప్రోత్సహించారు” అని కృతజ్ఞతలు తెలిపారు. అయితే త్వరలోనే తాము సినిమాలకు గుడ్‌బై చెబుతామని చెప్పి ఆశ్చర్యపరిచారు. సొంతూరికి వెళ్లి పచ్చటి ప్రకృతి నడుమ ప్రశాంత జీవితం సాగించాలని కోరుకుంటున్నామని రామ్ లక్ష్మణ్ లు వెల్లడించారు.