పిల్లలకు పాఠాలు చెప్పే పనిలో సినీ తారలు

  • September 5, 2018 / 06:49 AM IST

సినీ రంగంలో పనిచేసే నటీనటులకు క్షణం కూడా తీరిక ఉండదు. కలిసొచ్చే కాలంలోనే, క్రేజ్ ఉన్న సమయంలోనే ఎంతోకొంత సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుకే దృష్టి సినిమాపైనే పెట్టి ఉంటారు. కానీ కొంతమంది స్టార్స్ బిజీ షెడ్యూల్ లోను కొంత సమయాన్ని పిల్లలకు కేటాయిస్తున్నారు. టీచర్లుగా మారి పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించాలని లక్ష్యంగా 2014లో “టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌” స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. మొత్తం 600 మంది వలంటీర్లు వారానికోసారి ఆయా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్‌లో రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పిస్తారు.

ఈ సంస్థను మరింత ప్రోత్సహించేందుకు కొందరు సినీ తారలు ముందుకొచ్చారు. వీలైన సమయంలో పాఠశాలలకు వెళ్లి గంటపాటు ఇంగ్లిష్‌ బోధిస్తున్నారు. రానా, రకుల్‌ ప్రీత్‌ సింగ్, రెజీనా, ప్రణీత, అల్లు శిరీష్‌ తదితరులు ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరు ఆసక్తిగా పాఠాలు బోధిస్తుండడంతో పాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. “పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ప్రతి నెలా రెండుసార్లు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు క్లాస్‌ తీసుకుంటున్నాను” అని రెజీనా సంతోషంతో చెప్పింది. ఇటీవల బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, హిమాయత్‌నగర్, ఫిలింనగర్, సికింద్రాబాద్‌ తదితర పాఠశాలల్లో రెజీనా, ప్రణీత పాఠాలు బోధించారు. మరింతమంది స్టార్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus