యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’, మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్టు లేక అల్లాడుతున్న గోపీచంద్ కు.. ‘ఈ చిత్రాలు సక్సెస్ ను అందిస్తాయి’ అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 4 ఏళ్ల క్రితం ఆగిపోయిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఓటిటిలో విడుదల అవుతుంది అని గత ఏడాది ప్రచారం జరిగింది. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ఆల్రెడీ ‘జీ’ వారు రూ.8 కోట్లకు కొనుగోలు చేశారు.
వాళ్ళు ఓటిటి రిలీజ్ కు అంగీకరించకపోవడంతో కథ అడ్డం తిరిగింది. ‘మీరు ఓటిటి రిలీజ్ చేసుకుంటామని ముందుగా చెబితే అంత భారీ రేటు పెట్టి మేము డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను తీసుకునేవాళ్ళం కాదని’ వాళ్ళు చెప్పారట. అంతేకాదు ఓటిటి రిలీజ్ కనుక ఇస్తే.. ‘తమ వద్ద తీసుకున్న రూ.8 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని’ కండిషన్ కూడా పెట్టారట. దీంతో దర్శక నిర్మాతలు వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో అలాగే ఆంధ్రాలో థియేటర్లు తెరుచుకున్నాయి.
పలు చోట్ల నైట్ కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. అవి కూడా ఎత్తేసిన తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ టైంలో థియేట్రికల్ రిలీజ్ చేస్తే ఎంత మంది చూస్తారు అన్నది కూడా అనుమానమే..! కానీ ఆ వెంటనే.. అంటే రెండు వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసుకునే అవకాశం దర్శకనిర్మాతలకు లభిస్తుంది. ప్లాన్ బానే ఉంది… కానీ వారనుకున్నది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..!