ప్రతి ఒక్కరికి ఒకరకమైన శైలి ఉంటుంది. ఆ శైలి నచ్చే అతనికి అభిమానులు ఏర్పడుతుంటారు. అలా సంగీత దర్శకుల్లో ఎస్ థమన్ స్టయిల్ వేరు. కిక్, దూకుడు, బిజినెస్ మ్యాన్ వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. అయితే అతని ప్రతిభని కొంతమంది అవమానిస్తున్నారు. కాపీ రాయుడు అంటూ విమర్శిస్తున్నారు. థమన్ రీసెంట్ గా ఇచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఆల్బమ్ లోని పాటలు.. ఇది వరకు అతనే స్వయంగా కంపోజ్ చేసిన పాటల ట్యూన్స్ ని పోలి ఉన్నాయని హేళన చేస్తున్నారు. ఈ విమర్శలపై థమన్ ఘాటుగానే స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. ” కాపీ ట్యూన్స్ అనే విమర్శల్ని నేను పట్టించుకోను. దమ్ముంటే అగ్ర సంగీత దర్శకుల్ని ఇదే విషయమై ప్రశ్నించండి” అని మీడియాకు సవాల్ విసిరారు.
“కానీ ఆ పని ఎవరూ చేయరు. నేను కామ్‌గా ఉంటాను కాబట్టే కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు” అని థమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ… “నేను నిజంగా ట్యూన్స్ కాపీ చేసే వాడిని అయితే ఇన్ని అవకాశాలు వచ్చేవా? ఇంత తక్కువ సమయంలో 60 సినిమాలకు పనిచేసేవాడినా? అసలు త్రివిక్రమ్ అవకాశం ఇచ్చేవారా?” అని విమర్శకులను మీడియా ముఖంగా ప్రశ్నించారు. “ప్రతి సంగీత దర్శకుడికీ ఒక స్టైల్ ఉంటుంది, దాన్ని కాపీ అంటే ఎలా?” అని గట్టిగానే చెప్పారు. అరవింద సమేత బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో థమన్ భాగస్వామ్యం కూడా ఉంది. అందుకే అతను కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.