పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై పది సంవత్సరాలైనా బుల్లితెరపై మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమాలలో గబ్బర్ సింగ్ ఒకటిగా నిలిచింది. పవన్ అభిమానులు స్పెషల్ గా భావించే గబ్బర్ సింగ్ హిందీ సినిమా దబాంగ్ రీమేక్ అనే విషయం తెలిసిందే.
మొదట ఈ సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తిని చూపించలేదు. ఒక సందర్భంలో పవన్ మాట్లాడుతూ గబ్బర్ సింగ్ సినిమాలో తాను తప్పనిసరి పరిస్థితుల్లో నటించానని చెప్పారు. దబాంగ్ సినిమా స్క్రీన్ ప్లే సల్మాన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని దబాంగ్ లో కొత్తదనం ఏముందని తనకు అనిపించిందని పవన్ తెలిపారు. మొదట తాను చేయలేనని చెప్పానని అయితే కొన్ని రీజన్స్ వల్ల తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాల్సి ఉండటంతో దబాంగ్ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నానని పవన్ పేర్కొన్నారు.
గుడుంబా శంకర్ లో ఒక సీన్ లో తాను పోలీస్ గా కనిపించగా ఆ రోల్ ను స్పూర్తిగా తీసుకుని గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పాత్ర తన స్టైల్, వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ టైటిల్ కు స్పూర్తి అని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని పోలీస్ రోల్ కు ఆ పేరు సూట్ అవుతుందని భావించానని పవన్ పేర్కొన్నారు.
గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ కు బదులుగా హరీష్ శంకర్ కనిపించారు. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. శృతి హాసన్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పవన్ ను ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని అనుకున్నారో ఈ సినిమాలో హరీష్ శంకర్ అదే విధంగా చూపించారు.