Fish Venkat: పవన్‌ ఆర్థిక సాయం.. సీనియర్‌ నటుడు ఎమోషనల్‌.. ఏమైందంటే?

సీనియర్‌ నటుడు మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆరోగ్య, కుటుంబ పరిస్థితిని వివరించారు, అలాగే తనకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ఆర్థిక సాయం గురించి చెప్పారు. ఆయన మాటలు విని ‘మా పవన్‌ది మంచి మనసు’ అంటూ మురిసిపోతున్నారు. పవన్‌ ఇలా చాలామందికి సాయం చేయాలని ఆశిస్తున్నారు. సినిమాల్లో విలన్‌, విలన్‌ సహాయకుడు, కమెడియన్‌గా చాలా పాత్రలు పోషించి మెప్పించిన నటుడు ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat).

Fish Venkat

అయితే ఆయన గత కొన్నాళ్ల నుండి కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందిగా మారడంతో వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో పెద్దలకు చెబుదాం అనుకున్నా మొహమాటంతో ఇన్నాళ్లూ చెప్పలేదట. కానీ భార్య చెప్పినట్లుగా ఓసారి పవన్‌ కల్యాణ్‌ను కలుద్దామని ఇటీవల ఫిష్‌ వెంకట్‌ పవన్‌ సినిమా సెట్‌కి వెళ్లారు.

అక్కడ ఆయనను కలసి విషయం చెబితే వెంటనే స్పందించి నీ వైద్యం సంగతి నేను చూసుకుంటా అని పవన్‌ మాటిచ్చారట. అలాగే వెంటనే ఆర్ధిక సాయంగా రూ.2 లక్షలు బ్యాంకు అకౌంట్‌లో వేయించారు అని ఫిష్‌ వెంకట్‌ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో తనను, తన కుటుంబాన్ని ఆదుకున్న పవన్ కల్యాణ్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు ఫిష్‌ వెంకట్‌కు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ తరఫున సాయం అందిస్తే బాగుంటుంది అని నెటిజన్లు కోరుతున్నారు. ఆయన విషయంలో ఇతర అగ్ర తారలు కూడా ముందుకొస్తే బాగుంటుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఫిష్‌ వెంటక్‌ 2023లో రవితేజ ‘నరకాసుర’ సినిమాలో నటించారు. ఆ తర్వాత నుండి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు. ఆయన అనారోగ్యం నుండి కోలుకొని తిరిగి నటించాలని మనమూ ఆశిద్దాం.

హిట్ 3 షూటింగ్లో ఘోర విషాదం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus