పెళ్లిలో అందరూ సంతోషంగా ఉంటారు. పెళ్లి అయ్యాక అప్పగింతల సమయంలో ఇటు అమ్మాయి, అటు ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇన్నాళ్లూ గారాబంగా పెంచిన కూతురు వేరే ఇంటికి వెళ్లిపోతోందనేది వారి బాధ. ఇన్నాళ్లూ తనను మహరాణిలా చూసుకున్న తల్లిదండ్రులు దూరమవుతున్నారని కష్టం. అయితే పెళ్లి సమయంలో మొత్తం పందిరిలో ఉన్న అందరూ ఏడిస్తే… అది కచ్చితంగా రణ్‌బీర్ కపూర్ – ఆలియా పెళ్లే అవుతుంది. అవును ఆ పెళ్లిలో మొత్తం అందరూ ఏడుస్తూనే ఉన్నారట.
ఈ పెళ్లి గురించి ప్రముఖ నిర్మాత, ఆలియా – రణ్‌బీర్ సన్నిహితుడు అయిన కరణ్ జోహార్ వివరించారు. పెళ్లి సమయంలో అక్కడ ఉన్న కపూర్ ఫ్యామిలీ అందరి కంట కన్నీరే కనిపించిందట. ఎందుకు ఏడుస్తున్నారో అంటూ.. కరణ్, ఆలియా తండ్రి మహేష్ భట్ మధ్య చర్చ కూడా సాగింది. పెళ్లిలో రణ్‌బీర్ కపూర్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయని చెప్పారు కరణ్. అంతలా ఎమోషనల్ అయిపోయారట పెళ్లి గురించి. మహేష్ భట్ అయితే.. తెగ జోకులు వేశారట.
ఇక పెళ్లి జరిగిన విధానం గురించి కూడా ఆలియా చెప్పింది. తమ పెళ్లి చాలా సాధారణంగా అవ్వాలని రణ్‌బీర్ – ఆలియా అనుకున్నారట. అందుకే తమ ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. రోజూ లాగే కలసి మాట్లాడుకుని, కూర్చుని, భోజనం చేసి.. ‘బై గర్ల్ ఫ్రెండ్, బై బై బాయ్ ఫ్రెండ్’ అని చెప్పుకొని మండపానికి వచ్చిన భార్య భర్తలుగా మారిపోయాం అని చెప్పుకొచ్చింది ఆలియా. పెళ్లికి ముందే ఈ జోడీ కలసి ఉన్నారు.
కరోనా సమయంలో రెండు కుటుంబాలు దాదాపు కలసే ఉన్నాయి. ఆ సమయంలోనే రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ చనిపోవడంతో నీతూ కపూర్‌కి తోడుగా ఆలియా అక్కడే ఉందట. ఇక పండగల రోజుల్లో కపూర్ల సందడి ఎలా ఉంటుందో కూడా చెప్పింది ఆలియా. తమ కుటుంబం చాలా చిన్నదని, కానీ కపూర్ల ఇంట్లోకి కోడలుగా వచ్చాక చిన్న పండగ కూడా పెద్ద పండగలా భారీగా జరుగుతుందని చెప్పింది. దానికి తాను అలవాటు పడ్డానని కూడా చెప్పింది.