ప్రతివారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా కంటెంట్ బట్టి అది హిట్ లేదా ఫ్లాప్ అని మొదటి ఆటకే డిసైడ్ అవ్వడం వంటివి టకటకా జరిగిపోతుంటాయి. అయితే.. ఈవారం విడుదలైన (Gaami) “గామి” మాత్రం ఈ రెగ్యులర్ లిస్ట్ కి మినహాయింపు. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా 2018లో మొదలైన ఈ చిత్రం చాలా కష్టాలు కోర్చి ఎట్టకేలకు నేడు (మార్చి 08) విడుదలైంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి (Vidyadhar Kagita) విద్యాధర్ దర్శకుడు. మరి చిత్రబృందం దాదాపు ఆరేళ్లపాటు పడిన కష్టాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది చూద్దాం..!!
కథ: అఘోరాల మధ్య పెరిగుతాడు శంకర్ (విశ్వక్ సేన్). ఎవరైనా ముట్టుకుంటే విపరీతమైన నొప్పికి లోనయ్యే వ్యాధితో నరకం చూస్తుంటాడు. ఈ నొప్పి నుండి బయటపడాలంటే.. ద్రోణగిరిలో 36 ఏళ్లకోసారి వికసించే మాలిపత్రాలు (పుట్టగొడుగులు) సాధించాలి. అత్యంత క్లిష్టమైన ఈ పయనంలో శంకర్ కి జాహ్నవి (చాందిని చౌదరి) (Chandini Chowdary) తోడుగా వస్తుంది. కట్ చేస్తే.. దక్షిణభారతంలోని ఓ గ్రామంలో దేవదాసీ వ్యవస్థ కారణంగా దుర్గ (అభినయ) (Abhinaya) జీవితం నాశనం అవుతుంది, తన బాధ కూతురు పడకూడదు అని ఉమ (హారిక పెదాడ)ను ఊరు నుండి బయటకు పంపించాలనే ప్రయత్నంలో కన్ను మూస్తుంది.
అదే తరుణంలో.. మంచు కొండల్లోని ఎవరికీ తెలియని ఒక ల్యాబొరేటరీలో మనిషి బ్రెయిన్ ను కంట్రోల్ చేయడానికి ప్రయోగం జరుగుతుంటుంది. ఆ ప్రయోగాన్ని సబ్జెక్ట్ 333 (Mohammad Samad) (మహమ్మద్ సమద్) మీద నిర్వహిస్తుంటారు. అక్కడ్నుంచి ప్రాణాలతో బయటపడి ఒక సాధారణ జీవితం సాగించాలని కోరుకుంటాడు సబ్జెక్ట్ 333. ఈ ముగ్గురికి ఉన్న సారూప్యత ఏమిటి? వీరి ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులేమిటి?
నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ ఒక డేరింగ్ రోల్ చేసాడు. నిజానికి ఈ తరహా పాత్రను మరో స్టార్ హీరో అయితే యాక్సెప్ట్ చేసి ఉండదు. ఈ సినిమా కోసం అతడు పడిన కష్టం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మహమ్మద్ సమద్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ ప్రయోగశాలలో చిక్కుకున్న ఎలుకలా అతడి పాత్రని ప్రెజంట్ చేసిన తీరు, ఆ పాత్రలో అతడు జీవించిన విధానం బాగున్నాయి. వీళ్ళిద్దరికంటే మంచి నటన, హావభావాలతో అలరించిన నటి “అంటే సుందరానికి” ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ హారిక పెదాడ.
చిన్నారి ఉమగా ఆమె నటన సినిమాకు కీలకంగా మారింది. (Mayank Parakh) మయాంక్ పరాక్, చాందిని చౌదరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. చాందిని చౌదరి ఒక తెలుగమ్మాయిగా ఎంచుకుంటున్న పాత్రలను మాత్రం మెచ్చుకోవాలి.
సాంకేతికవర్గం పనితీరు: నరేష్ కుమరన్ (Naresh Kumaran) నేపధ్య సంగీతం & విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. నరేష్ సెకండాఫ్ లోని ఎమోషన్స్ ను తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేసిన విధానానికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి ఫిలిం మేకింగ్ విషయంలో పాటించే చాలా రూల్స్ ను బ్రేక్ చేసాడు. సహజమైన లొకేషన్స్ లో చాలా కష్టంతో కూడిన ఫ్రేమింగ్స్ తో కథను, కథనాన్ని ఎలివేట్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. దర్శకుడు విద్యాధర్ చాలా సాధారణ కథను, అసాధారణమైన కథనంతో ఆద్యంతం ఆకట్టుకొనేలా తెరకెక్కించిన విధానం బాగుంది. కథను నమ్మి, క్రౌడ్ ఫండింగ్ తో సినిమాను మొదలుపెట్టి.. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని, సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చి.. థియేటర్లలో విడుదలయ్యేలా చేసిన నిర్మాత కార్తీక్ శబరీష్ అభినందనీయుడు.
బడ్జెట్ ఇష్యుస్ వల్ల కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తిస్థాయిలో చెప్పలేకపోయినా, ప్రేక్షకులకు సింపుల్ గా అర్ధమయ్యేలా ముగించిన విధానం మాత్రం ప్రశంసనీయం. దర్శకుడిగా అతడికి మంచి భవిష్యత్ ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను మెచ్చుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ లో, ఈ స్థాయి అవుట్ పుట్ అనేది ఎవ్వరూ ఊహించలేనిది, మరెందరికో మార్గదర్శకమైనది.
విశ్లేషణ: తెలుగులో వచ్చిన సినిమాలుగా మిగిలిపోయే చిత్రాలు కొన్ని, ఇది తెలుగు సినిమారా అని చెప్పుకొనే చిత్రాలు కొన్ని. ఈ రెండో వర్గానికి చెందిన సినిమా “గామి”. ప్రొడక్షన్ డిజైన్ మొదలుకొని గ్రాఫిక్స్ వరకూ ప్రతీ టెక్నీకాలిటీ పారదర్శకంగా ఉండడం గమనార్హం. క్లైమాక్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
బాటమ్ లైన్: తెలుగు సినిమా స్థాయిని పెంచే “గామి”.
రేటింగ్: 3.5/5