ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అనవసరంగా ట్రోల్ మెటీరియల్ అయిపోయాడే కానీ.. దర్శకుడిగా వెంకటేష్ మహాకు ఉన్న గౌరవం వేరు. “కేరాఫ్ కంచరపాలెం” ట్విస్ట్ కి ఆడియన్స్ అందరూ “ఎవర్రా బాబు ఇంత బాగా తీసాడు” అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” రీమేక్ అయినప్పటికీ, తనదైన శైలిలో నవ్యత చూపించాడు వెంకటేష్ మహా. ఆ తర్వాత నటుడిగా కొన్ని సినిమాలు, సిరీస్ లు చేసి.. బిజీ అయిపోయాడు.
కట్ చేస్తే.. వెంకటేష్ మహా-సత్యదేవ్ ల కాంబినేషన్ లో “రావు బహద్దూర్”అనే సినిమా మొన్న ఎనౌన్స్మెంట్ జరిగినప్పటినుంచి మంచి ఆసక్తి నెలకొల్పింది. సత్యదేవ్ గెటప్ ఆశ్చర్యపరచగా.. ఇవాళ విడుదల చేసిన టీజర్ లాంటి క్యారెక్టర్/సినిమా బ్యాగ్రౌండ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. తనను తాను రాజుగా భావించే ఓ వ్యక్తి ఆలోచనలు, ఊహలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ “రావ్ బహద్దూర్” ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడమైతే ఖాయం అనిపిస్తోంది. ముఖ్యంగా.. ఈ టీజర్ లో రివీల్ చేసిన కొన్ని డీటెయిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్నిటికంటే స్మరణ సాయి నేపథ్య సంగీతం, కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ వర్క్ హైలైట్ గా నిలిచాయి. వీటన్నిటినీ సత్యదేవ్ బాగా బ్యాలెన్స్ చేశాడు. ఓ ముసలి రాజుగా, కుర్రోడిగా, మధ్య వయస్కుడిగా చాలా కొత్తగా కనిపించాడు. సత్యదేవ్ కెరీర్ లో ఇదొక మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.
వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజయ్యే ఈ సినిమాకి ఈ టీజర్ మంచి హైప్ తీసుకొచ్చింది. మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామి అవ్వడం విశేషం. ఈ సినిమా గనుక సరిగ్గా వర్కవుట్ అయ్యిందంటే.. వెంకటేష్ మహా ట్రోల్స్ అన్నిటికీ సమాధానం చెప్పినట్లవుతుంది. ఈ టీజర్ ను రాజమౌళి లాంచ్ చేయడం అనేది విశేషం.