‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’ వంటి బయోపిక్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గంధర్వ’. ‘ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ బేనర్ పై ‘యఎస్.కె. ఫిలిమ్స్’ సహకారంతో ‘యాక్షన్ గ్రూప్’ సమర్పిస్తున్న చిత్రమిది. సురేష్ కొండేటి సమర్పణలో అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని అబ్దుల్ నిర్మించారు.ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో, కొద్దో గొప్పో బజ్ ను క్రియేట్ చేసిన సినిమాల్లో ‘గంధర్వ’ కూడా ఒకటి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందో.. నొప్పించిందో తెలుసుకుందాం రండి.
కథ : 1971లో ఇండియన్ ఆర్మీ లో పనిచేసే కెప్టెన్ అవినాష్(సందీప్ మాధవ్).. తన ఇంట్లో వాళ్ళు చూసిన అమూల్య(గాయత్రి సురేష్) ని వివాహం చేసుకుంటాడు. పెళ్లి జరిగిన వెంటనే అతన్ని ఇండో – పాక్ యుద్ధం కోసం చేరాలని ఆర్మీ నుండి పిలుపు వస్తుంది.వెంటనే ఆర్మీకి బయలుదేరతాడు అవినాష్. అయితే ఆ యుద్ధంలో అతను మరణించినట్టు అధికారులు ధృవీకరిస్తారు. కానీ అతను ఓ లోయలో పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. 50 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు.
అయితే ఆ 50 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోతాయి. ఇంతకీ అవినాష్ కుటుంబ సభ్యులు ఏమయ్యారు? అతన్ని గుర్తుపట్టారా? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : సందీప్ మాధవ్ తన గత సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా బాగా చేశాడు. కెప్టెన్ అవినాష్ పాత్రలో అతని లుక్ కూడా బాగుంది. అవినాష్ భార్య అమూల్య గా గాయత్రి సురేష్ నటన బాగుంది. వృద్ధ వయసులో అతని భర్త తిరిగి వచ్చాడు అని తెలుసుకుని ఆమె పండించిన నటన బాగుంది. అతి తక్కువ టైంలోనే గాయత్రి కి దొరికిన బరువైన పాత్ర ఇది. ఆమె పాత్రకు తగ్గట్టుగా హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.కాకపోతే వృద్ధాప్యంలో కూడా రొమాంటిక్ సన్నివేశాలు వంటివి అతిగా ఉన్నాయి.
దానికి ఈమె కారణం కాదు కాబట్టి.. ఇక్కడికి ఈమె పాసైపోతుంది. మరో హీరోయిన్ శీతల్ భట్ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. సినిమాకి గ్లామర్ కావాలి కాబట్టి ఆమె ఉంది అనిపిస్తుంది. సాయి కుమార్ బాగానే చేశాడు. చాలా కాలం తర్వాత బాబు మోహన్ కు మంచి పాత్ర దొరికింది. సీనియర్ హీరో సురేష్ కూడా బాగా చేశాడు. పోసాని, రోహిణి వంటి మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కథనాన్ని నడిపిన తీరు కూడా బాగా అనిపిస్తుంది. ఇలాంటి పాయింట్ తో 2 ఏళ్ల క్రితం రవితేజ ‘డిస్కో రాజా’ కూడా వచ్చింది. గతేడాది చివర్లో వచ్చిన నాని ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా గుర్తుకొస్తుంది. కానీ టేకింగ్ పరంగా ఆ సినిమాలకు, ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఈ సినిమాలో కొన్ని అతి అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు అలాంటి వాటి విషయంలో బ్యాలెన్స్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది.
50 ఏళ్ల పాటు ఓ వ్యక్తి కోమాలో ఉండడం.. ఆ తర్వాత బ్రతకడం..అనే ఫిక్షనల్ గా బాగానే ఉంది కానీ కోమాలోకి వెళ్ళినప్పుడు అతని వయసు ఎలా ఉందో.. అతను కళ్ళు తెరిచిన తర్వాత కూడా అతని లుక్ అలాగే ఉండటం అనేది తొందరగా డైజెస్ట్ చేసుకోలేని అంశం.రవితేజ ‘డిస్కో రాజా’ ను జనాలు అందుకే ఆదరించలేదు.ఇక 2 గంటల 10 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు సీరియస్ గా సాగుతున్న కథకి అడ్డు తగులుతున్న ఫీలింగ్ కలిగించింది.అది పక్కన పెడితే.. ర్యాప్ రాక్ షకీల్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టు ఉన్నాయి.
విశ్లేషణ : ‘గంధర్వ’ పెద్దగా విసిగించదు.. అలా అని ఎంటర్టైన్ చేయదు. వీకెండ్ కు ఏదో ఒక సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు.