సినిమాల్లో చక్కగా నటించి ఎంతోమంది మనసులను గెలుచుకున్న వారు.. రాజకీయాల్లోకి వచ్చి నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎంపీలాగానే కాకుండా మంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి ప్రజలకు సేవ చేశారు. ఆ బాటలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. సినీ కెరీర్ సజావుగా సాగుతున్నప్పటికీ.. సినిమాకి పాతిక కోట్లు పారితోషికం అందుకున్నప్పటికీ వాటికీ వదులుకొని ప్రజాసేవకై జనసేన పార్టీ ని స్థాపించారు. ఆ పార్టీ స్థాపించగానే మెగా ఫ్యామిలీ పవన్ కి అండగా నిలిచింది. ఇతర రాజకీయ పార్టీ నేతల నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి. సినీ స్టార్స్ కొంతమంది పవన్ కి మద్దతు తెలుపుతుండగా.. మరికొంతమంది పవన్ ఏ మార్పు తీసుకొస్తారోనని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిలో నటి గౌతమి ఒకరు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూ లో గౌతమి మాట్లాడుతూ.. “ఎవరైనా రాజకీయాల్లోకి రావడమనేది వాళ్ల సొంత విషయం. అయితే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత… ఎలా పని చేస్తారు? ప్రజలకు ఎలా సేవ చేస్తారు? సేవ చేయడం కన్నా ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారు? అన్నది ప్రధానం. ఈ జర్నీ అనేది ఒకరోజులోనో, లేదంటే ఆరు నెలల్లోనో తెలిసేది కాదు. రాను రాను చూడాలి. సినిమా స్టార్ కాబట్టి నేను సపోర్ట్ చేయను. ఎక్కడ ప్రజలకు మంచి జరుగుతుందో అక్కడ నా సపోర్ట్ ఉంటుంది’’ అని గౌతమి స్పష్టం చేశారు.