గౌతమ్ నంద

  • July 28, 2017 / 10:52 AM IST

గోపీచంద్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా “గౌతమ్ నంద”. మాస్ పల్స్ మీద మంచి పట్టు ఉన్న సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ లు కథానాయికలు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!

కథ : గౌతమ్ (గోపీచంద్) అపర కుబేరుడు. అన్నీ ఉన్నా ఏదో లేని ఫీలీంగ్ తో కాలాన్ని వెళ్లదీస్తుంటాడు. నంద (గోపీచంద్) కటిక బీదవాడు. స్వచ్చమైన తండ్రి అభిమానం, నిర్మలమైన తల్లి ప్రేమ ఉన్నప్పటికీ.. డబ్బు లేదనే బాధతో చనిపోవడానికి సిద్ధపడతాడు. డబ్బు తప్ప ఏమీ లేని గౌతమ్, అన్నీ ఉన్నా డబ్బు లేక బాధపడే నంద ఒక నిర్ణయం మేరకు ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్తారు. అప్పటివరకూ డబ్బు వాసన మాత్రమే చూస్తూ పెరిగిన గౌతమ్ కి “నంద అండ్ ఫ్యామిలీ” చూపించే ప్రేమాభిమానాలు మనసు కరిగిస్తే.. చిన్నప్పట్నుంచి బోరబండ సందుల్లో మరుగునీరు మధ్య జీవితం గడుపుతూ వచ్చిన నందకు “గౌతమ్ ఆస్తి” గుండెను రాతి బండలా మారుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది “గౌతమ్ నంద” సినిమా చూసి తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు.

నటీనటుల పనితీరు : గోపీచంద్ నటుడిగా తనలోని మల్టిపుల్ షేడ్స్ ను ఈ చిత్రంతో పరిచయం చేశాడు. కెరీర్ తొలినాళ్లలో “నిజం, జయం” వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్ ప్లే చేసిన అనుభవం ఉండడంతో, “నంద” పాత్రలో నెగిటివ్ షేడ్ ను అద్భుతంగా పండించాడు. కొన్ని రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండ్ చేశాడు కూడా. ముఖ్యంగా.. గౌతమ్-నంద పాత్రల మధ్య వైవిధ్యాన్ని చక్కగా చూపించగలిగాడు. హన్సిక-కేతరీన్ లు రెండు పాటలు నాలుగు సన్నివేశాలకు మిగిలిపోయారు. అయితే.. హన్సిక కంటే కేతరీన్ ఈ చిత్రంలో అందంగా కనిపించడంతోపాటు కాస్త సెన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసింది. నికితన్ ధీర్, ముఖేష్ రుషి వంటి సీజన్డ్ ఆర్టిస్ట్స్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. చంద్రమోహన్-సీత దిగువ మధ్యతరగతి భార్యాభర్తలుగా చక్కని నటన కనబరచడంతోపాటు.. పాత్రలకు కాస్త వెయిట్ ను కూడా పెంచారు.

సాంకేతికవర్గం పనితీరు : గోపీచంద్ తర్వాత సినిమా విషయంలో ఆశ్చర్యపరిచేది సంపత్ నంది. ఇప్పటివరకూ కంప్లీట్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు తీస్తూ వచ్చిన సంపత్ నంది, మొదటిసారిగా కమర్షియల్ అంశాలకు హ్యూమన్ ఎమోషన్స్ ను జోడించి “గౌతమ్ నంద” క్యారెక్టర్ ను రాసుకోవడం ప్రశంసార్హం. “నేనేవరనే ప్రశ్నకు సమాధానం కోసం వెతికే బాటసారిని నేను” అని గౌతమబుద్ధుడి ప్రవచనం నుండి బేసిక్ థీమ్ ను తీసుకొన్న సంపత్ నంది, “రమణ మహర్షి” కొటేషన్స్ ను కథలో అంతర్లీనంగా చెప్పుకుంటూ వచ్చాడు.

గౌతమ్ క్యారెక్టర్ ను చాలా డీప్ గా ఎలివేట్ చేసిన సంపత్.. కథలో కీలకమైన “నంద” పాత్రను మాత్రం సరిగా ఎలివేట్ చేయకపోవడంతోపాటు సరైన రీజనింగ్ కూడా ఇవ్వకపోవడం మైనస్. అలాగే.. బస్తీ కష్టాలను ఎక్కువగా చూపించడం కోసం రాసుకొన్న పాట, సన్నివేశాలు సినిమా లెంగ్త్ ను పెంచడానికి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. సినిమా మొదలైన 20 నిమిషాల్లో కథ మొత్తం ఊహించేస్తాడు ప్రేక్షకుడు. అయితే.. సెకండాఫ్ లో సంపత్ నంది రాసుకొన్న ట్విస్ట్ విపరీతంగా ఆశ్చర్యపరుస్తుంది. అప్పటివరకూ సాగిన కథనం ఒక్కసారిగా వేగం పుంజుకొని పరుగులు మొదలెడుతుంది. ఒక దర్శకుడిగా కంటే ఒక రైటర్ గా సంపత్ నంది మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. మొట్టమొదటిసారిగా తమన్ తన డప్పులకు పని చెప్పకుండా.. “బీట్ 3” మ్యూజిక్ తో బీజీయమ్-నేపధ్య సంగీతంతో అలరించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా కీలకం. చాలా సన్నివేశాలను తన నేపధ్య సంగీతంతో సరికొత్తగా ఎలివేట్ చేశాడు.

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. మాటల్లో చెప్పలేని చాలా భావాలను తన కెమెరా పనితనంతో అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు. హీరో ఎలివేషన్ షాట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా.. హీరో ఎమోషనల్ గా ఓపెన్ అయ్యే సన్నివేశాల్లో అతడి భావాలను కెమెరాలో బంధించిన విధానం ప్రశంసనీయం. నిర్మాతల సాహసానికి సలాం చెప్పాల్సిందే. 30 కోట్ల రూపాయల మార్కెట్ లేని గోపీచంద్ లాంటి హీరో మీద 35 కోట్లు ఖర్చు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క డ్రోన్ షాట్స్ మినహా సినిమా మొత్తం “ఇంతలా ఖర్చు పెట్టారేంట్రా బాబూ”సగటు సినిమా ప్రేక్షకుడు ముక్కున వేలేసుకొనేలా ఉన్నాయి నిర్మాణ విలువలు.

విశ్లేషణ : బేసిక్ గా ఈ తరహా కథలతో చాలా సినిమాలోచ్చాయి. “రాముడు-భీముడు, గంగ-మంగ” మొదలుకొని మొన్న వచ్చిన “జెంటిల్ మెన్” వరకూ కవలల కథలతో చాలా సినిమాలోచ్చాయి. అయితే.. క్యారెక్టరైజేషన్స్ ను డీప్ గా ఎస్టాబ్లిష్ చేయడం మినహా “గౌతమ్ నంద”లో పెద్దగా ప్లస్ పాయింట్సేమీ కనిపించకపోవడంతోపాటు.. సాగదీసిన స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్.  సో, గోపీచంద్ చూపించిన డిఫరెంట్ షేడ్స్, బికినీలో కేతరీన్ అందాల కోసం “గౌతమ్ నంద” చిత్రాన్ని కాస్త ఓపికతో ఒకసారి చూడొచ్చు!

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus