విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “గాయత్రి”. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ, అనసూయ కీలకపాత్ర పోషించగా మంచు విష్ణు కీలకపాత్రలో నటించాడు. ట్రైలర్ తో మంచి క్రేజ్ ఏర్పరుచుకొన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : శివాజీ (మోహన్ బాబు) ఒక స్టేజ్ ఆర్టిస్ట్, తన అనుకొన్నవాళ్లందరినీ కోల్పోయి “శారదా సదనం” అనే అనాధాశ్రమం పేరిట అనాధలకు అండగా నిలుస్తాడు. అయితే.. అనాధలను ఆదుకోవడం కోసం కావాల్సిన డబ్బు కోసం మినిస్టర్లు, బిజినెస్ మ్యాన్ లకు జైలు శిక్షలు పడినప్పుడు వారిస్థానంలో, వారి వేషంలో జైలు శిక్ష అనుభవించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంటాడు. అలాంటి ఒక కేస్ నిమిత్తం గాయత్రి పటేల్ అనే నిందితుడి స్థానంలో రిమాండ్ అనుకోని జైలుకి వెళ్ళి ఉరిశిక్షను అనుభవించాల్సి వస్తుంది. తెలియక ఇరుక్కుపోయిన ఈ కేస్ నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు? ఇంతకీ “గాయత్రి పటేల్” ఎవరు? అతనికి ఉరిశిక్ష ఎందుకు పడింది? ఈ కేస్ లో శివాజీ బలవంతంగా ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే “గాయత్రి” చిత్రం.
నటీనటుల పనితీరు : మోహన్ బాబు చాలా విరామం అనంతరం నటించడం వల్లనో లేక రీసెంట్ మూవీస్ ఆయన చూడకపోవడం వలనో తెలియదు కానీ “శివాజీ” పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ 90ల నాటి చిత్రాల్లో గుమ్మడి నటనను తలపిస్తుంది. అయితే.. “గాయత్రి పటేల్”గా నెగిటివ్ షేడ్ రోల్ లో అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచి.. విలక్షణ నటుడు అని ఆయనకున్న బిరుదును నిరూపించుకొన్నారు. సిన్సియర్ జర్నలిస్ట్ రోల్ లో అనసూయ ఆకట్టుకొంది. ఆమె క్యారెక్టరైజేషన్ ను ఇంకాస్త డీప్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్స్ లో మంచు విష్ణు, శ్రియ ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. నిఖిలా విమల్ ఇన్నోసెంట్ గర్ల్ గా ఆకట్టుకొంది. సహాయక పాత్రల్లో పోసాని కృష్ణమురళి, శివరామకృష్ణలు మెప్పించగా.. ప్రేక్షకుల్ని నవ్వించడానికి అలీ చేసిన విఫల యత్నాలు కథనానికి అడ్డంకిగా మారాయి.
సాంకేతికవర్గం పనితీరు : గ్రాఫిక్స్ డిపార్ట్ ఎఫెర్ట్ ను మెచ్చుకోవాలి. మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించే సన్నివేశాల్లో తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. చాలా వరకూ ఫ్రేమ్స్ లో సీజీవర్క్ పరంగా తప్పులేం లేకుండా చూసుకొన్నారు. తమన్ బాణీల్లో “ఒక నువ్వు ఒక నేను” మినహా పెద్దగా ఆకట్టుకొనే పాటలేమీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సర్వేష్ మురారీ సినిమాటోగ్రఫీ వర్క్ రిచ్ గా ఉంది. అయితే.. మోహన్ బాబు వయసు రిత్యా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అన్న ఉద్దేశ్యంతో ఆయన్ని ఎక్కువగా కదలనివ్వకుండా, నడవనివ్వకుండా ఆయన చుట్టూ కెమెరాని ఎక్కువగా తిప్పడం వల్ల ఆడియన్స్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా మాస్ ఆడియన్స్ కోరుకొనే పంచ్ లు లేవు. డైమండ్ రత్నబాబు రాసుకొన్న కథ కంటే డైలాగులు బాగున్నాయి. పురాణాల్లోని సందర్భాలను నేటి పరిస్థితులకు అనుకరించి రాసిన మాటలు మోహన్ బాబు చెప్పిన విధానానికి క్లాప్స్ కొడతారు జనాలు. ప్రొడక్షన్ వేల్యూస్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. కాకపోతే.. సీన్ టు సీన్ కంటిన్యూటీ మిస్ అయ్యింది.
దర్శకుడు మదన్ ఇప్పటివరకూ హ్యాండిల్ చేయని జోనర్ సినిమా ఇది. అయినప్పటికీ తనకున్న ఎక్స్ పీరియన్స్ తో సినిమాని మాగ్జిమమ్ ఎఫెర్ట్ పెట్టి హ్యాండిల్ చేశాడు. నటీనటులందరి నుంచి చక్కని నటన రాబట్టుకొన్నాడు. కాకపోతే స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. తదుపరి సన్నివేశం ఏమిటనేది ప్రతి ప్రేక్షకుడు ముందే ఊహించగలుగుతున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే “వాలి-సుగ్రీవుడు” ఫార్మాట్ ఫైట్ సీక్వెన్స్ మరీ హైలైట్ అని చెప్పలేం కానీ.. కాస్త ఆసక్తిని రేకెత్తింది. కాకపోతే.. 25 ఏళ్ల మంచు విష్ణు 50 ఏళ్ళకి మంచు మోహన్ బాబులా అయిపోవడం, గాయత్రి పటేల్ హెయిర్ స్టైల్ కేవలం కటింగ్, షేవింగ్ చేసుకొని శివాజీలా మారిపోవడం అనేవి మరీ లాజిక్ లెస్ గా కనిపిస్తాయి. అయితే.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ మినహా పెద్దగా ఎవరూ ఆ లాజిక్స్ ని పట్టించుకోరు కాబట్టి సినిమా సేఫ్ అనే చెప్పాలి.
విశ్లేషణ : మోహన్ బాబు నటన మీద అభిమానం, ఆయనంటే రెస్పెక్ట్ ఉన్న వారిని ఖచ్చితంగా ఆకట్టుకొనే చిత్రం “గాయత్రి”. కాకపోతే అవుట్ డేటెడ్ స్టోరీ, లాజిక్ లేని సన్నివేశాలు, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.
రేటింగ్ : 2/5