గీత గోవిందం

  • August 15, 2018 / 08:28 AM IST

“అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా అఖండ విజయం అనంతరం దాదాపు ఏడాది తర్వాత హీరోగా నటించగా విడుదలవుతున్న చిత్రం “గీత గోవిందం”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కథానాయికగా నటిస్తుండగా బన్నీ వాసు నిర్మించారు. విడుదలకుముందే కొన్ని కీలకమైన సన్నివేశాలు లీక్ అవ్వడంతో కాస్త బాధపడిన చిత్రబృందం కాస్త జాగ్రత్తగా పబ్లిసిటీ ప్లాన్ చేసుకొని ఈ బుధవారం (ఆగస్ట్ 15) చిత్రాన్ని విడుదల చేశారు. ఆల్రెడీ ఫస్ట్ డే హౌస్ ఫుల్ బుకింగ్స్ తో హల్ చల్ చేస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా లేదా? “గీత గోవిందం”ల గిల్లికజ్జాలు ప్రేక్షకులను నవ్వించగలిగాయా లేదా? అనేది సమీక్షలో తెలుసుకొందాం..!!


కథ:
చిన్నప్పట్నుంచి చాగంటి కోటేశ్వర్రావుగారి ప్రవచనాలు విని.. తనకొచ్చే భార్య ఆయన చెప్పినట్లు పద్ధతిగా, దేవతలా ఉండాలని ఫిక్స్ అవుతాడు విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ). కాలేజ్ వయసు నుంచి చాలా మందిని ట్రై చేస్తాడు కానీ పెద్దగా ఎవరూ వర్కవుట్ అవ్వరు. ఆఖరికి ఒకమ్మాయి వెంట ఆరు నెలలు పడ్డాక.. తీరా ఆమెకు అప్పటికే పెళ్ళైందని తెలిసి ఢీలాపడిపోతాడు.
కట్ చేస్తే.. గుడిలో సాంప్రదాయబద్ధంగా లంగాఓణీలో కనిపిస్తుంది గీత (రష్మిక మండన్నా). ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కొన్ని రోజుల తర్వాత తన చెల్లెలి పెళ్లి కుదిరిందని హైద్రాబాద్ నుంచి కాకినాడ బయలుదేరుతుండగా అదే బస్ లో మళ్ళీ కనిపిస్తుంది గీత. ఆమె వచ్చి తన పక్కనే కూర్చోవడంతో.. ఆమె నిద్రలోకి జారుకోగానే ఆమెతో ఓ సెల్ఫీ దిగాలని విజయ్ చేసే ప్రయత్నంలో అనుకోకుండా ఆమెకు ముద్దు పెట్టేస్తాడు. కనీసం ముఖపరిచయం లేని వ్యక్తి తన పెదాలకు ముద్దు పెట్టడంతో బస్ లో రచ్చ రచ్చ చేసిన గీత.. వెంటనే పెద్ద రౌడీ అయిన వాళ్ళన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఎక్కడ గీత వాళ్ళ అన్నయ్య తనను చంపేస్తాడేమోనన్న భయంతో రన్నింగ్ బస్ లో నుంచి దూకేసి ఇంటికి పారిపోతాడు విజయ్.
మళ్ళీ కట్ చేస్తే.. గీత మరెవరో కాదని తన చెల్లెల్ని పెళ్లి చేసుకొని తనకు బావ కాబోతున్న సుబ్బరాజు చెల్లెలని తెలుసుకొని అవాక్కవుతాడు విజయ్. అలా మొదలైన గీత గోవిందంల ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి గీత=గోవిందంలు పెళ్లి చేసుకోగలిగారా లేదా? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:
“అర్జున్ రెడ్డి” తర్వాత “గీత గోవిందం” రిలీజ్ అవ్వడం విజయ్ దేవరకొండకు బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది. ఆ సినిమాలో ఇంటెన్సిటీతో అదరగొట్టిన విజయ్ ఈ చిత్రంలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకొన్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ను మాత్రం సరిగా పండించలేకపోయాడు.
రష్మిక అందంగా కనిపించినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సన్నివేశం బాగున్నా అమ్మడి ఎక్స్ ప్రెషన్ కాస్త ఇబ్బందికరంగా ఉండేది.
నిత్యామీనన్, అను ఎమ్మాన్యూల్ అతిధి పాత్రలో ఆకట్టుకొన్నారు. తండ్రి పాత్రలో నాగబాబు, రౌడీ బావగా సుబ్బరాజు, ఫ్రెండ్స్ పాత్రల్లో రాహుల్ రామకృష్ణ & గ్యాంగ్, పెళ్లికొడుకుగా వెన్నెల కిషోర్, బామ్మగా అన్నపూర్ణమ్మ భలే నవ్వించారు. వీరి పాత్రలు డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలను నటీనటులు పండించిన తీరు బాగుంది.


సాంకేతికవర్గం పనితీరు:
గోపీసుందర్ సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు సినిమాలోని ఎమోషన్స్ ను ఫీలయ్యేలా చేశాడు గోపీసుందర్. అయితే.. చిన్నసైజు సెన్సేషన్ క్రియేట్ చేసిన “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే” పాట వినడానికి బాగున్నంతగా చూడ్డానికి బాగోలేకపోవడం గమనార్హం.
మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో ప్రొడక్షన్ వేల్యూస్ కనపడతాయి. గీతా ఆర్ట్స్ సంస్థ కూడా మరీ ఎక్కువగా డబ్బులు వృధా చేసినట్లుగా ఎక్కడా కనిపించదు.
ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విషయాల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అక్కడక్కడా చిన్న చిన్న జర్క్స్ వస్తుంటాయి కానీ.. పరశురామ్ కామెడీ టైమింగ్ & ఎమోషన్స్ డైలాగ్స్ ఆ లోటును కనబడనివ్వవు.దర్శకుడు-కథకుడు పరశురామ్ తన ప్రతి సినిమాలో చేసినట్లే మాటలతో మాయ చేశాడు. సినిమా కాస్త డల్ అవుతుంది అనిపిస్తున్న ప్రతిసారి సింగిల్ లైన్ పంచ్ లేదా కామెడీ ట్రాక్స్ తో ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టించలేదు. అందువల్ల సినిమా మొత్తంలో ఆడియన్స్ ఎక్కడా కూడా నీరసపడరు. పరశురామ్ స్పెషాలిటీ అయిన ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాలో లెక్కకు మిక్కిలి ఉండడం.. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ & క్లైమాక్స్ లో వచ్చే సంభాషణలు మనసుకి హత్తుకోవడమే కాదు మన మనసులోని ఆలోచనలకు ప్రాణం పోస్తాయి. ఒకమ్మాయి అబ్బాయిని ఎందుకు ప్రేమించాలి? అబ్బాయి తాను పెళ్లి చేసుకోవాలనుకొనే అమ్మాయి విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వకూడదు? అసలు నిజమైన ప్రేమంటే ఏమిటి? అనే ప్రశ్నలకు పరశురామ్ తనదైన శైలి సంభాషణలతో చెప్పిన సమాధానాలు హృద్యంగా ఉన్నాయి.
ఈ సినిమాతో పరశురామ్ ఒక డైరెక్టర్ గా కంటే ఎక్కువగా రైటర్ గా ఎక్కువ మార్కులు కొట్టేశాడు. సెకండాఫ్ లో సినిమా కాస్త గాడితప్పినట్లు అనిపిస్తున్న తరుణంలో వెన్నెలకిషోర్-అన్నపూర్ణమ్మ కాంబినేషన్ కామెడీతో మళ్ళీ ట్రాక్ లోకి లాగాడు.

విశ్లేషణ:
రెండున్నర గంటలపాటు ఆరోగ్యకరమైన హాస్యంతో, ఎమోషన్స్ తో పరశురామ్ వడ్డించిన విందు భోజనం “గీత గోవిందం”. ఒక కొత్త విజయ్ దేవరకొండను చూడడం కోసం అతడి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఒకట్రెండుసార్లు సంతోషంగా చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus