తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హిట్టు కొట్టి నాలుగేళ్లవుతోంది. “పింక్” రీమేక్ గా వచ్చిన “నేర్కొండ పర్వాయ్” తర్వాత అతడు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో అజిత్ కమ్ బ్యాక్ ఫిలిం కోసం అతడి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” (Good Bad Ugly) మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ పీక్ లెవల్లో వర్కవుట్ అయ్యింది. మరి సినిమా ఏస్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఒకప్పుడు పెద్ద డాన్ అయిన ఏకే (అజిత్ కుమార్) పుట్టిన బిడ్డ, కట్టుకున్న భార్య కోసం అన్నీ వదిలేసుకుని జైలుకి వెళతాడు. సరిగ్గా కొడుకు విహాన్ (కార్తికేయ దేవ్) 18వ పుట్టినరోజున బయటికి వచ్చి సెలబ్రేట్ చేయాలనుకుంటాడు ఏకే.
కట్ చేస్తే.. ఏకే స్పెయిన్ కి వచ్చే టైమ్ కి విహాన్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఏకే గతం ఏమిటి? అతను ఎందుకంత పవర్ ఫుల్ డాన్ గా మారాడు? కొడుకు విహాన్ ను జైల్ నుంచి ఎలా బయటపడేలా చేశాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “గుడ్ బ్యాడ్ అగ్లీ” కథాంశం.
నటీనటుల పనితీరు: అజిత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా మంచి విందు భోజనం అని చెప్పాలి. ముఖ్యంగా అజిత్ ను మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే.. సినిమాలోని రిఫరెన్సులకు బీభత్సంగా కనెక్ట్ అవ్వడమే కాక, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. తన అభిమానులకు నచ్చే విధంగా కనిపించడం కోసం అజిత్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి చాన్నాళ్ల తర్వాత ఫుల్ మాస్ రోల్ లో కనిపించాడు. అయితే.. ఆ రిఫరెన్సులు తమిళ అభిమానులు మాత్రమే కనెక్ట్ అవ్వగలరు, తెలుగులో ఆ రిఫరెన్సులు పెద్దగా వర్కవుట్ అవ్వవు.
అర్జున్ దాస్ కి చాలారోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ దొరికింది. అతడు ఆ పాత్రను అద్భుతంగా పండించాడు. అర్జున్ దాస్ బెస్ట్ ఇంట్రో ఈ సినిమాలోనే కుదిరింది. అతని క్యారెక్టర్ ఆర్క్ కూడా భలే ఉంది.
త్రిష, సునీల్, ప్రసన్నల పాత్రలు డీసెంట్ గా ఉన్నాయి. సిమ్రాన్ క్యారెక్టర్ భలే వర్కవుట్ అయ్యింది. జాకీ ష్రాఫ్, టిను ఆనంద్ తదితరులు ఉన్నప్పటికీ.. వారి పాత్రలు సరిగా పండలేదు.
సాంకేతికవర్గం పనితీరు: జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అజిత్ పాత సూపర్ హిట్ సాంగ్స్ ను రీమాస్టర్ చేసిన విధానం కూడా భలే పేలింది. పాటలు, నేపథ్య సంగీతం కథనాన్ని ఎలివేట్ చేశాయి.
అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగా సహకరించడం, నిర్మాతలు ఖర్చుకి రాజీపడకపోవడం సినిమాకి ప్లస్ అయ్యింది.
దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కథ-కథనం మీద కంటే అజిత్ ఫ్యాన్స్ ను సంతుష్ట పరచడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ముఖ్యంగా సెకండాఫ్ ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటుంది. కొరియన్ యాక్టర్ డాంగ్లీ, అమెరికన్ యాక్షన్ క్యారెక్టర్ జాన్ విక్, స్పానిష్ రిఫరెన్స్ తో ప్రొఫెసర్ పాత్రలను ఎలివేషన్ కోసం వినియోగించుకున్న విధానం భలే ఉంది. అవి అర్థమవ్వాలంటే కాస్త హాలీవుడ్ & నెట్ ఫ్లిక్స్ టచ్ ఉండడం ముఖ్యమే అయినప్పటికీ.. సదరు పరిచయాలు లేకపోయినా ఆ ప్యూర్ సెన్స్ లెస్ మాస్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కథ, కథనం, క్యారెక్టర్ ఆర్క్స్ విషయంలో చాలా సమస్యలున్నప్పటికీ.. ఆడియన్స్ ను రెండున్నర గంటలపాటు అలరించడంలో ఆధిక్ రవిచంద్రన్ 100% విజయం సాధించాడు.
విశ్లేషణ: కొన్ని మాస్ సినిమాలు కథ, కథనంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తాం. “గుడ్ బ్యాడ్ అగ్లీ” రొటీన్ కి మించిన రొడ్డకొట్టుడు సినిమా. కానీ.. అజిత్ పాత సినిమాల రిఫరెన్సులు, ముఖ్యంగా అతని సూపర్ హిట్ సాంగ్స్ ను, మేనరిజమ్స్ ను రీ క్రియేట్ చేసిన విధానం హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తుంది. అందువల్ల.. సినిమాలో లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా అజిత్ & ఆధిక్ మ్యాజిక్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: డీసెంట్ ఫ్యాన్ బాయ్ ఫిలిం!
రేటింగ్: 2.5/5