ఈమధ్యకాలంలో సినిమా చూడడమే ఓ పెద్ద ప్రహసనంలా మారిపోయింది. పెరిగిన పెట్రోల్ ధరలు, భారీ ట్రాఫిక్ పుణ్యమా అని థియేటర్లకు వెళ్ళడం పెద్ద తలపోటుగా మారితే.. ఇక టికెట్ రేట్లకి పదిరెట్లు ఎక్కువైన మల్టీప్లెక్స్ ఫుడ్ బిల్ కట్టలేక కొందరు మల్టీప్లెక్స్ లకు వెళ్లడానికి జంకుతున్నారు. వెళ్ళిన కొందరు ఆకలికి ఆగలేకనో, నూరించే ఫుడ్ ను చూసి కంట్రోల్ చేసుకోలేకనో, పిల్లలు గొడవ పెడితేనో తప్పని పరిస్థితుల్లో వందలకు వందలు తగలేసి పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ ను కొంటున్నారు. రీసెంట్ గా మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు ఫుడ్ పేరుతో పాల్పడుతున్న దోపిడీకి చెక్ పెడుతూ.. ప్రేక్షకులు అవుట్ సైడ్ ఫుడ్ ను థియేటర్లోకి తీసుకెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చింది.
ముంబై, బెంగుళూరులో కంటే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైద్రాబాద్ లోనే సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువ. అందుకే.. స్టేట్ లీగల్ మెట్రోలజీ డిపార్ట్ మెంట్ కంట్రోలర్ ఆకున్ సభర్వాల్ మహారాష్ట్ర తరహాలో అవుట్ సైడ్ ఫుడ్ ను థియేటర్లలోకి ఎంట్రీ వెలుసుబాటు కల్పించకపోయినా.. మల్టీప్లెక్స్ యాజమాన్యం పాప్ కార్న్ పేరుతో ప్రేక్షకుల్ని దోచుకొనే పద్ధతికి స్వస్తి పలకాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇకనుంచి ఎం.ఆర్.పి ధరలకే పాప్ కార్న్ సహా మిగతా ఫుడ్ ను విక్రయించాలనే చట్టాన్ని ఆగస్ట్ 1 నుంచి అమలు చేయనుంది. అయితే.. ఎం.ఆర్.పి ధరలకే విక్రయించాలనే మెలికను మల్టీప్లెక్స్ యాజమాన్యం గనుక దుర్వినియోగపరచాలనుకొంటే.. ఆ ధరలను తమకు అనుగుణంగా ప్రింట్ చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ చట్టమైనా సామాన్యుడు థియేటర్ లో సినిమా చూస్తూ బాధపడకుండా పాప్ కార్న్ కొనుక్కోనేలా చేస్తుందో లేదో చూడాలి.